భవిష్యత్తు వాతావరణ పదజాలం – భౌమ్యావరణ భవిష్యత్తు

0

*భవిష్యత్తు వాతావరణ పదజాలం – భౌమ్యావరణ భవిష్యత్తు*

*వాతావరణ పదజాలం అంటే:* ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణానికి సంబంధించిన శాస్త్రీయ పదాలు మరియు భావనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, శక్తి వినియోగం, జీవవైవిధ్యం వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించే ప్రత్యేకమైన పదాలను వాతావరణ పదజాలం (క్లైమేట్ ఒకేబులరీ ) అని అంటారు. ఈ పదాలు ప్రధానంగా క్లైమేట్ చేంజ్ , పర్యావరణ శాస్త్రం, భూగోళ శాస్త్రం మరియు జీవశాస్త్రం వంటి రంగాలలో ఉపయోగించబడతాయి. సాధారణంగా చెప్పాలంటే, వాతావరణానికి సంబంధించిన ప్రక్రియలు, సమస్యలు, ప్రభావాలు మరియు పరిష్కారాలను వివరించడానికి ఉపయోగించే పదాల సమాహారమే వాతావరణ పదజాలం.

వాతావరణ పదజాలంలో అనేక ముఖ్యమైన భావనలు ఉన్నాయి. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్ , కార్బన్ ఫుట్ప్రింట్ , రెన్యువబుల్ ఎనర్జీ , బయోడైవర్సిటీ , సస్టైనబుల్ డెవలప్మెంట్ వంటి పదాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఈ పదాలు వాతావరణ మార్పుల కారణాలు, వాటి ప్రభావాలు మరియు వాటిని తగ్గించే మార్గాలను వివరించడానికి ఉపయోగపడతాయి. శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు, పర్యావరణ సంస్థలు మరియు విద్యార్థులు ఈ పదజాలాన్ని ఉపయోగించి వాతావరణ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారాలపై చర్చిస్తున్నారు. వాతావరణ పదజాలం యొక్క ప్రధాన పాత్ర ప్రజలకు అవగాహన కల్పించడం. వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయి, అవి మన జీవన విధానంపై ఎలా ప్రభావం చూపుతున్నాయి అనే విషయాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయడంలో ఈ పదాలు సహాయపడతాయి. ఉదాహరణకు “గ్లోబల్ వార్మింగ్” అనే పదం ద్వారా భూమి ఉష్ణోగ్రత పెరుగుతున్న సమస్యను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే “కార్బన్ ఫుట్‌ప్రింట్” అనే పదం మన దైనందిన కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను గుర్తు చేస్తుంది. ఈ విధంగా వాతావరణ పదజాలం ప్రజలలో పర్యావరణ బాధ్యతను పెంచుతుంది.

ఇంకా ఒక ముఖ్యమైన పాత్ర విధానాల రూపకల్పనలో కనిపిస్తుంది. ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విధానాలు రూపొందించేటప్పుడు ఈ శాస్త్రీయ పదజాలాన్ని ఆధారంగా తీసుకుంటాయి. ఉదాహరణకు సుస్థిర అభివృద్ధి, పునరుత్పత్తి శక్తి వినియోగం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి కార్యక్రమాలు ఈ భావనల ఆధారంగానే అమలు చేయబడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పర్యావరణ సమావేశాలు మరియు ఒప్పందాలలో కూడా ఈ పదజాలం కీలక పాత్ర పోషిస్తుంది. వాతావరణ పదజాలం విద్యా రంగంలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పర్యావరణ శాస్త్రం చదివే విద్యార్థులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ పదాలను అర్థం చేసుకోవడం అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పులు ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే సమస్య. కాబట్టి వాతావరణ పదజాలం ద్వారా ప్రకృతి వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, మన చర్యలు వాటిపై ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.

*వాతావరణంలో వాటి పాత్ర:* వాతావరణ పదజాలం అనేది కేవలం శాస్త్రీయ పదాల సమాహారం మాత్రమే కాదు. ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు వాటికి పరిష్కారాలు కనుగొనడానికి ఒక ముఖ్యమైన సాధనం. ఈ పదజాలం ద్వారా ప్రజల్లో అవగాహన పెరిగి ప్రకృతి సంరక్షణకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది. చివరికి వాతావరణ పదజాలం మనందరినీ ప్రకృతితో సమతుల్యంగా జీవించే దిశగా మార్గనిర్దేశం చేస్తుంది. ప్రపంచం వేగంగా మారుతున్న కాలాన్ని మనం చూస్తున్నాము. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు గతంతో పోలిస్తే విపరీతంగా మారుతున్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి, వాటిని ఎదుర్కోవడానికి కొత్త భావనలు, కొత్త పదజాలం మన జీవితంలోకి వచ్చాయి. ఈ పదజాలాన్ని “ఎ క్లైమేట్ ఒకేబులరీ అఫ్ ది ఫ్యూచర్” అని చెప్పవచ్చు. భూమి ఉష్ణోగ్రత పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాలు, జీవవైవిధ్యం తగ్గుదల, నీటి కొరత వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పదాలు భవిష్యత్తు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత అవసరమైనవిగా మారుతున్నాయి. ఈ సందర్భంలో *వాతావరణ మార్పు* (క్లైమేట్ చేంజ్) అనే భావన ప్రపంచవ్యాప్తంగా ప్రధాన చర్చగా మారింది.

వాతావరణ మార్పులలో ముఖ్యమైన అంశం *గ్లోబల్ వార్మింగ్*. పరిశ్రమలు, వాహనాలు, బొగ్గు మరియు పెట్రోలియం వంటి ఫాసిల్ ఇంధనాల అధిక వినియోగం కారణంగా గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో ఎక్కువగా చేరుతున్నాయి. ఫలితంగా భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీనివల్ల హిమ పర్వతాలు కరుగుతుండటం, సముద్ర మట్టం పెరగడం, తీవ్రమైన ఎండలు మరియు భారీ వర్షాలు వంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు భూమిపై ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి చేసే ప్రతి చర్యకు పర్యావరణంపై ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. అందుకే కార్బన్ ఫుట్ ప్రింట్ అనే భావన ప్రాముఖ్యత పొందింది. ఒక వ్యక్తి, సంస్థ లేదా దేశం తన కార్యకలాపాల ద్వారా వాతావరణంలోకి విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని *కార్బన్ ఫుట్‌ప్రింట్* అంటారు. విద్యుత్ వినియోగం, వాహనాల ప్రయాణం, పరిశ్రమల కార్యకలాపాలు ఇవన్నీ కార్బన్ ఉద్గారాలను పెంచుతాయి. భవిష్యత్తులో పర్యావరణాన్ని రక్షించాలంటే ఈ కార్బన్ ముద్రను తగ్గించడం అత్యంత అవసరం.

ఈ సమస్యలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఇప్పుడు *నెట్ జీరో ఏమిషన్స్* అనే లక్ష్యాన్ని స్వీకరిస్తున్నాయి. దీనర్థం వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను తగ్గించి, అదే స్థాయిలో వాటిని చెట్లు లేదా ఇతర ప్రకృతి వనరుల ద్వారా తిరిగి శోషించే విధానాన్ని అమలు చేయడం. చెట్లను విస్తృతంగా నాటడం, పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను నియంత్రించడం, శుద్ధమైన శక్తి వనరులను ప్రోత్సహించడం ఈ లక్ష్యానికి కీలకమైన చర్యలు. ఇదే సమయంలో భవిష్యత్తు శక్తి అవసరాలను తీర్చడానికి *రెన్యువబుల్ ఎనర్జీ* ఎంతో ముఖ్యమైంది. సౌరశక్తి, గాలి శక్తి, జల విద్యుత్ వంటి పునరుత్పత్తి అయ్యే వనరుల ద్వారా శక్తిని ఉత్పత్తి చేయడం వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫాసిల్ ఇంధనాలపై ఆధారపడకుండా పర్యావరణానికి హాని తక్కువగా కలిగించే ఈ శక్తి వనరులు భవిష్యత్తు ప్రపంచానికి ఆశాజ్యోతి లాంటివి.

వాతావరణ మార్పులు పూర్తిగా నివారించలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ, వాటి ప్రభావాలను తగ్గించడానికి సమాజం సిద్ధంగా ఉండాలి. దీనిని *క్లైమేట్ రెసిలియన్స్* అని అంటారు. వరదలు, తుఫాన్లు, ఎండలు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని జీవన విధానాన్ని కొనసాగించగల సామర్థ్యాన్ని పెంచడం ఇందులో ముఖ్యమైన అంశం. ఉదాహరణకు *నీటి సంరక్షణ*, *పర్యావరణానికి అనుకూల వ్యవసాయం*, *చెట్ల పెంపకం* వంటి చర్యలు సమాజాన్ని మరింత స్థిరంగా నిలబెడతాయి. భూమిపై ఉన్న జీవజాతులన్నింటి సమాహారాన్ని *బయోడైవర్సిటీ* అంటారు. ఇది *ప్రకృతి సమతుల్యత* కు మూలాధారం. కానీ *వాతావరణ మార్పులు*, *అడవుల నాశనం*, *కాలుష్యం* వంటి కారణాల వల్ల అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. జీవవైవిధ్యం తగ్గిపోతే *ప్రకృతి సమతుల్యత* దెబ్బతింటుంది. అందువల్ల *జీవవైవిధ్య సంరక్షణ* భవిష్యత్తు ప్రపంచానికి అత్యంత అవసరం. ఇక అభివృద్ధి అనే పేరు మీద ప్రకృతిని నాశనం చేయకుండా ఉండటానికి *సుస్థిర అభివృద్ధి* (సస్టెనబుల్ డెవలప్మెంట్) అనే భావనకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుత తరానికి అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల అవసరాలను దెబ్బతీయకుండా అభివృద్ధి సాధించడం సుస్థిర అభివృద్ధి లక్ష్యం. ఇది పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక సమానత్వం అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే *“ఏ క్లైమేట్ ఒకేబులరీ ఆఫ్ ది ఫ్యూచర్”* అనేది కేవలం పదాల సమాహారం మాత్రమే కాదు. ఇది మన భూమి భవిష్యత్తును కాపాడేందుకు అవసరమైన అవగాహనను కలిగించే ఒక మార్గదర్శక వ్యవస్థ. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, సామాన్య ప్రజలు కలిసి పనిచేయాలి. ప్రకృతిని గౌరవించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, జీవవైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా మాత్రమే మన భూమిని భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించగలుగుతాము.

*ప్రపంచ వాతావరణ మార్పులు – పరిష్కార మార్గాలు:* ఇప్పటి ప్రపంచంలో మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సమస్యల్లో ఒకటి క్లైమేట్ చేంజ్. గత కొన్ని దశాబ్దాలుగా పరిశ్రమల విస్తరణ, అటవీ నాశనం, జనాభా పెరుగుదల మరియు ఫాసిల్ ఇంధనాల అధిక వినియోగం వల్ల భూమి వాతావరణ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు కేవలం ఉష్ణోగ్రత పెరుగుదలకే పరిమితం కాకుండా వర్షపాతం నమూనాలు, గాలిమార్గాలు, సముద్ర ప్రవాహాలు మరియు జీవవ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. వాతావరణ మార్పులు మానవ సమాజానికి మాత్రమే కాకుండా భూమిపై ఉన్న అన్ని జీవరాశులకు కూడా తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రధాన కారణాల్లో ఒకటి గ్లోబల్ వార్మింగ్ , అంటే భూమి సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరగడం. పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాలు మరియు బొగ్గు, పెట్రోలియం వంటి ఫాసిల్ ఇంధనాల వినియోగం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు అధికంగా చేరుతున్నాయి. ఈ వాయువులు సూర్యుని నుండి వచ్చే ఉష్ణాన్ని భూమి చుట్టూ నిల్వ ఉంచడం వల్ల భూమి వేడెక్కుతోంది. దీని ఫలితంగా హిమపర్వతాలు కరుగుతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతోంది, అలాగే అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

*వాతావరణ మార్పులు – జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం:* ఈ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయి. తీవ్రమైన తుఫాన్లు, భారీ వరదలు, అడవి అగ్నిప్రమాదాలు, కరువులు వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో భారీ వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాలు తీవ్ర ఎండలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని మరియు ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ప్రభావాలను ఎక్కువగా అనుభవిస్తున్నాయి. వాతావరణ మార్పులు జీవవైవిధ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భూమిపై ఉన్న వివిధ రకాల జంతువులు, పక్షులు, మొక్కలు మరియు సూక్ష్మజీవుల సమాహారాన్ని బయోడైవర్సిటీ అంటారు. ఈ జీవవైవిధ్యం ప్రకృతి సమతుల్యతకు మూలాధారం. కానీ అడవుల నాశనం, కాలుష్యం మరియు వాతావరణ మార్పుల వల్ల అనేక జీవజాతులు తమ నివాసాలను కోల్పోతున్నాయి. కొన్ని జాతులు పూర్తిగా అంతరించిపోతున్నాయి. ఇది ప్రకృతి సమతుల్యతకు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా మరో పెద్ద సమస్య సముద్ర మట్టం పెరగడం. హిమపర్వతాలు మరియు ధృవ ప్రాంతాల మంచు కరుగడం వల్ల సముద్ర మట్టం క్రమంగా పెరుగుతోంది. దీనివల్ల తీర ప్రాంత నగరాలు, ద్వీప దేశాలు మరియు సముద్ర తీర గ్రామాలు ప్రమాదంలో పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజలు తమ నివాసాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని *క్లైమేట్ మైగ్రేషన్* అని అంటారు. భవిష్యత్తులో ఇది పెద్ద సామాజిక మరియు ఆర్థిక సమస్యగా మారే అవకాశముంది. వాతావరణ మార్పులు ప్రపంచం మరియు భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు – పరిష్కార మార్గాలు భారతదేశం కూడా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తీవ్రంగా అనుభవిస్తున్న దేశాలలో ఒకటి. భారతదేశంలో వ్యవసాయం ప్రధానంగా మాన్సూన్ వర్షాలపై ఆధారపడి ఉంటుంది. కానీ వాతావరణ మార్పుల కారణంగా మాన్సూన్ వర్షపాతం అస్థిరంగా మారుతోంది. కొన్ని సంవత్సరాల్లో భారీ వరదలు సంభవిస్తే, మరికొన్ని సంవత్సరాల్లో తీవ్ర కరువు ఏర్పడుతోంది. దీని వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరియు ఆహార భద్రతపై కూడా ప్రభావం పడుతోంది.

*భారతదేశ వాతావరణ మార్పులు – పరిష్కార మార్గాలు:* భారతదేశంలో నీటి కొరత కూడా పెరుగుతున్న సమస్యగా మారుతోంది. భూగర్భ జలాల అధిక వినియోగం, చెరువులు మరియు వాగుల నాశనం, పట్టణీకరణ వంటి కారణాల వల్ల అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. అలాగే పట్టణాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు *“హీట్ ఐలాండ్”* ప్రభావాన్ని పెంచుతున్నాయి. దీని వల్ల నగరాలలో వేసవికాలంలో తీవ్రమైన వేడి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భారతదేశం కూడా ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలతోపాటుగా అనేక చర్యలను చేపడుతున్నాయి. ముఖ్యంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత ముఖ్యమైన చర్య. అనేక దేశాలు నెట్ జీరో ఏమిషన్స్ లక్ష్యాన్ని ప్రకటించాయి. అంటే వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను తగ్గించి, అదే స్థాయిలో చెట్లు మరియు ప్రకృతి వ్యవస్థల ద్వారా వాటిని శోషించడమే ఈ లక్ష్యం. దీని కోసం భారీ స్థాయిలో అటవీ సంరక్షణ మరియు చెట్ల నాటకం చేపడుతున్నారు. ఇక భవిష్యత్తులో శక్తి అవసరాలను తీర్చడానికి రెన్యువబుల్ ఎనర్జీ వినియోగం పెంచడం చాలా ముఖ్యమైంది. సౌరశక్తి, గాలి శక్తి మరియు జల విద్యుత్ వంటి శక్తి వనరులు పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తాయి. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఈ శక్తి వనరులను విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించాయి. భారతదేశం కూడా సౌరశక్తి ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రముఖ దేశంగా ఎదుగుతోంది.

ఇవే కాకుండా అభివృద్ధి ప్రకృతికి హాని కలగకుండా ఉండే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ విధానాలను అమలు చేయడం అవసరం. అంటే ప్రస్తుత తరానికి అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల అవసరాలను దెబ్బతీయకుండా అభివృద్ధి సాధించడం. దీనిలో పర్యావరణ సంరక్షణ, ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక సమానత్వం అనే మూడు అంశాలు సమానంగా ఉండాలి. మొత్తం మీద వాతావరణ మార్పులు ప్రపంచ మానవాళి ఎదుట నిలిచిన ఒక పెద్ద సవాలు. ఈ సమస్యను ఒక దేశం లేదా ఒక సమాజం మాత్రమే పరిష్కరించలేరు. ప్రపంచంలోని అన్ని దేశాలు, ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు మరియు సామాన్య ప్రజలు కలిసి పనిచేయాలి. ప్రకృతిని గౌరవించడం, వనరులను జాగ్రత్తగా వినియోగించడం, చెట్లను నాటడం మరియు జీవవైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా మాత్రమే మన భూమిని భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించగలుగుతాము. ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత అని గుర్తించి ప్రతి వ్యక్తి తన వంతు కృషి చేయడం అత్యంత అవసరం.

*ప్రకృతిని గౌరవించి కాపాడితే – అది వనరులనిస్తూ భౌమ్యావరణాన్ని కాపాడుతుంది.*

*– రవిబాబు పిట్టల, ఎం.ఎస్సీ., ఎం.టెక్., (పిహెచ్.డి), పర్యావరణవేత్త, మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, జే.యన్.టీ.యు.హెచ్, హైదరాబాద్ మరియు జాయింట్ సెక్రటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్.జి.ఓ., తెలంగాణ స్టేట్, ఇండియా. మొబైల్: +91 9849425271*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *