డంపింగ్ యార్డ్ పెట్టి ప్రజల జీవితాలను బలి చేస్తారా..

0

డంపింగ్ యార్డ్ పెట్టి ప్రజల జీవితాలను బలి చేస్తారా..
– ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి
– సామాజిక వేత్త సబ్బని వెంకట్
హుజురాబాద్:
హుజురాబాద్ సమీపంలో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని, ఈ యార్డ్ పెట్టి ఇక్కడ ప్రజా జీవితాలను బలి చేస్తారా అని సామాజికవేత్త సబ్బని వెంకట్ ప్రభుత్వంపై మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలకు ఆయన శనివారం మద్దతు తెలిపి 24 గంటల నిరసన దీక్షను చేపట్టారు. వెంకట్ దీక్షకు యువకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. డంపింగ్ యార్డ్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తో భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఇది ప్రజల జీవిత సమస్య అని, నిజంగానే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటయితే ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుందని, రైతులు మహిళలు పిల్లలు ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. పశుపక్షాదుల ఉనికి సైతం ప్రశ్నార్థకమవుతుందని, పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ప్రజలు ముక్తకంఠంతో డంపింగ్ యార్డ్ వద్దని కోరుకుంటున్నారన్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వ సలహాదారుడు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని, ఎమ్మెల్సీ కోదండరాం లను కలిసి వివరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, ప్రభాకర్, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *