త్వరలోనే రైతు భరోసా ఇస్తాం…
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నాం..
. రైతులకు సన్నధాన్యానికి 500 బోనస్ చెల్లిస్తున్నాం
. త్వరలోనే రైతు భరోసా కూడా ఇస్తాం…
. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
. హుజురాబాద్ లో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
. కమిటీ చైర్మన్ గా గూడూరు రాజేశ్వరి
హుజురాబాద్:
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులకు మేలు జరుగుతున్నదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సోమవారం హుజరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన హుజూరాబాద్ మార్కెట్ కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిదీ రాజకీయంగా ఆలోచిస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదంగా ఉంటుందన్నారు. చరిత్రలో రైతుల గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇపుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కాళేశ్వరం లేకున్నా ఎల్లంపల్లి నుండి పొదుపుగా నీరు వాడుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాని పంట ఇపుడు వచ్చిందని, అందుకు ప్రకృతి కూడా సహకరించిందన్నారు. రైతుల ధాన్యం 20 వేల కోట్లు ప్రభుత్వ సొమ్ము రైస్ మిల్లర్ల వద్దే ఉందన్నారు. బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పామన్నారు. జీరో బ్యాలెన్స్ ఉన్న రైస్ మిల్లర్ల దగ్గరకు ధాన్యం పోతుందన్నారు. ఇటీవల ప్రతిపక్ష నాయకులు కల్లలా వద్దకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, సన్న వడ్ల కి 500 బోనస్ ఇస్తున్నామని, ఇప్పటికే అనేకమంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరికైనా రాకపోతే సమాచారం ఇవ్వాలని కోరారు.
రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశాం…
బిఆర్ఎస్ పార్టీ లక్ష రూపాయల రుణమాఫీనే దఫాల వారిగా చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒకే దఫాలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. ఎవరికైనా రుణమాఫీ కాకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలు తెలుపాలన్నారు. కుటుంబ నిర్ధారణ సర్వే జరుగుతుందని, ప్రభుత్వం సమాచారం సేకరిస్తున్నదన్నారు. వీలైనంత తొందరలో వారికి 2 లక్షల లోపు ఉన్న వారి రుణమాఫీ పూర్తవుతుందన్నారు. 2 లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
త్వరలోనే రైతు భరోసా…
ఇప్పటికే మంత్రివర్గ సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించిందన్నారు. రైతు భరోసా పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని, త్వరలోనే అర్హులైన రైతులందరికీ రైతు భరోసా కూడా ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. తను రైతు బిడ్డనేనని, రైతులకు సంబంధించిన అన్ని విషయాల పట్ల సంపూర్ణ అవగాహన ఉందన్నారు.
మహారాష్ట్రలో పోటీకి వెనుకడుగేసిన బిఆర్ఎస్…
టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా పేరు మార్చి మహారాష్ట్రకు వందల కార్లలో వెళ్లి ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేకపోయినా బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిందని సంతోషపడుతున్నారా… బిజెపి గెలిచిందని సంతోషపడుతున్నారా.. బిఆర్ఎస్ నాయకులు స్పష్టం చేయాలన్నారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ లాగా బిఆర్ఎస్, బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేకపోయారని విమర్శించారు.
ప్రణాళికతో సంక్షేమ పథకాలు అమలు…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రణాళికతో ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 110 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా 3720 కోట్ల విలువైన ప్రయాణం చేశారని తెలిపారు. 10 లక్షల ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ అందిస్తున్నామన్నారు. ఈ పథకాలు ఇంకా ఎవరికైనా అందకుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశామని, నిరుపేదలకు మొదటి దశలో ఇస్తామన్నారు. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవని త్వరలోనే కొత్త కార్డులు ప్రభుత్వం ఇస్తుందన్నారు.
కుల గణన సర్వే మార్పుకు శ్రీకారం…
కులగరణ సర్వే జరుగుతుందని, ఈ సర్వేతో దేశంలో పెద్ద మార్పు వస్తుందన్నారు. దేశానికి కుల గణన సర్వే దిక్సూచిగా మారుతుందన్నారు. ప్రజా పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు స్వేచ్చగా కలవగలుగుతున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చూస్తే ఖజానా అంతా ఖాళీగానే ఉందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయన్నారు. 11 నెలల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు. పదేళ్లలో బిజెపి, బిఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేశాయో ఆలోచించాలన్నారు.
వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధుల మంజూరు…
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆలయానికి నిత్యాన్నదాన సత్రం కోసం 35.25 కోట్లు మంజూరు చేసుకున్నామన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి శ్రీనివాస్ మేడిపల్లి సత్యంతో కలిసి వేములవాడ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించామన్నారు. ముంపు బాధితులు తమను ఆదుకోవాలని ఎన్నో ఉద్యమాలు చేసిన గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి 4960 ఇండ్లు మంజూరు చేశారన్నారు. అవాస్తవాలు ప్రచారం మానుకోని, ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ లో కష్టపడ్డవారికి న్యాయం జరుగుతుందని, పని చేసిన వారికి గుర్తింపు వస్తుందన్నారు.
హుజరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గూడూరి రాజేశ్వరి…
హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గూడూరు రాజేశ్వరి-స్వామిరెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కమిటీ సభ్యుల చేత జిల్లా వ్యవసాయ అధికారి ప్రకాశ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
