ప్లాస్టిక్ ను నిషేదించాలి
మహిళలు, పిల్లల సంక్షేమానికి శుక్రవారం సభ…
. ప్లాస్టిక్ నిషేధాన్ని ఈ సభ ద్వారా ప్రచారం చేయాలి
. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న శుక్రవారం సభ మహిళలు, పిల్లల సంక్షేమానికి ఎంతో దోహదపడుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురు మామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అనంతరం శుక్రవారం సభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ చేశారు. బాల్య వివాహ్ ముక్త భారత్ పోస్టర్ ఆవిష్కరించారు. గర్భిణీలకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… ప్రతి మహిళా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అప్పుడే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. గర్భిణీ, బాలింతల ఆరోగ్యం పట్ల శుక్రవారం సభలో చక్కటి అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారానికి ఈ సభ వేదికగా నిలుస్తోందన్నారు. ప్లాస్టిక్ నియంత్రించాలనే నినాదాన్ని కూడా శుక్రవారం సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ప్రతి గ్రామంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్లాస్టిక్ వినియోగానికి చెక్ పెడతామని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు…
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్నదని మంత్రి అన్నారు. ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కే గ్యాస్ వస్తున్నదన్నారు. ఎవరికైనా రాకపోతే మండల ఆఫీస్ లో ఫిర్యాదు చేయాలన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వస్తున్నాయన్నారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ వారికి కుటుంబ నిర్ధారణ పూర్తైన వారికి రుణమాఫీ చేస్తామన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం…
చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నవాబ్ పేట గ్రామంలో 20 లక్షల రూపాయల తో నిర్మించిన నూతన పంచాయతీ రాజ్ భవనాన్ని, 10 లక్షల రూపాయలతో నిర్మించిన రజక భవనం, 10 లక్షలతో నిర్మించిన యాదవ సంఘ భవనాలను మంచి ప్రారంభించారు. వీటితోపాటు చిగురు మామిడి మండలం ముదిమానిక్యంలో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. శుక్రవారం సభలో భాగంగా అంగన్ వాడి ప్రి పైమరి స్కూల్ పిల్లలకు యూనిఫాం పంపిణీ చేశారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ… గ్రామస్థాయిలో అధికారులందరి సమన్వయంతో గత ఆరు నెలలుగా ఈ శుక్రవారం సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా గర్భిణీలు, బాలింతలు చిన్నారులు తీసుకోవాల్సిన ఆహారాన్ని సూచిస్తారని తెలిపారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువు ఉండేలా అంగన్వాడి, ఆరోగ్యశాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు సమన్వయంతో తల్లులకు తగు సూచనలు ఇస్తారన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు సుమారు రూ.50 వేలు ఖర్చయే 60 రకాల పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల ప్రమాదకరమైన వ్యాధులను ముందే గుర్తించి నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఆర్డీవో మహేశ్వర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
