ఫార్మాసిటీ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్న కేటీఆర్..
ఫార్మాసిటీ పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్న కేటీఆర్
. ప్రజాస్వామ్య బద్దంగానే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన..
. పదేళ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమం 11 నెలల్లోనే సాధించాం..
. వరంగల్ లోనే మొదటి విజయోత్సవ సభ…
. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
హనుమకొండ:
ఫార్మా సిటీ పేరుతో కేటీఆర్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన హనుమకొండ నయీంనగర్ లోని శ్రీరస్తు కన్వెన్షన్ హల్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేటీఆర్, హరీశ్ రావులపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఇక్కడే విజయోత్సవ సభ..
రాణి రుద్రమదేవి ఏలిన ఖిల్లా ఓరుగల్లు జిల్లాలో మొట్ట మొదటి విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. గడిచిన 11నెలలుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అభివృద్ధిలో దూసుకుపోతున్నామని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో మన పనీతిరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షం సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పటికి నిజమైన లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వారు ఎన్ని అప్రజాస్వామిక పనులు చేసినా కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామిక పద్దతిలోనే ముందుకు వెళుతుందన్నారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరాల జల్లు కురిపించనున్నట్లు తెలిపారు. అదే విధంగా నగరంలోనూ అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, ప్రభుత్వవిప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగారాజు, గండ్ర సత్యనారాయణ రావు, డాక్టర్ మురళి నాయక్, మేయర్ గుండు సుధారాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, పైడాకుల అశోక్, ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, టీపీసీసీ నాయకులు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
