ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల నమ్మకాన్ని పెంచాలి

0

 ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల నమ్మకాన్ని పెంచాలి
– నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
– పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం
– హుజూరాబాద్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
హుజూరాబాద్‌
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలని, ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించేలా స్నేహపూర్వక పోలీసింగ్‌ అమలు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం సూచించారు. శనివారం హుజూరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన సందర్శించి, స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, రికార్డులను సమీక్షించారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీకి హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల గౌరవ వందనాన్ని సీపీ స్వీకరించారు. తనిఖీల్లో భాగంగా పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, కేసుల ఆస్తుల భద్రత, స్టేషన్‌ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. సిబ్బంది విధులు, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకతతో పాటు వేగవంతమైన సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల నిఘా కీలకమని పేర్కొంటూ, పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నిఘా కెమెరాలన్నీ నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. పెట్రోలింగ్‌ వాహనాలు, ఆధునిక పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రికార్డులను క్రమబద్ధీకరించాలని, వినియోగంలో లేని పాత సామగ్రిని కమిషనరేట్‌కు తరలించి స్టేషన్‌ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించి, ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌, ఎస్సైలు, పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *