జర్నలిస్టులపై దాడి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి

0

జర్నలిస్టులపై దాడి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి
– బాధ్యులుగా తేలిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి
– జిల్లా ఎస్పీకి టీఎంఎస్‌పీజెఏ రాష్ట్ర అధ్యక్షుడు కుడుతాడి బాపురావు వినతి

రాజన్న సిరిసిల్ల:
గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు జర్నలిస్టులు పోతూరి శేఖర్‌, రాతిపల్లి సంపత్‌లపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టి సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మీడియం స్మాల్ డైలీ అండ్ పీరియాడికల్స్ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, టిడబ్ల్యూజేఎఫ్‌ కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బాపురావు మాట్లాడారు.
వార్తా కథనాలు ప్రచురించారనే కారణంతో జర్నలిస్టులను అదుపులోకి తీసుకుని శారీరకంగా హింసించారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నించడం, ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం తమ వృత్తిలో భాగమని తెలిపారు. వార్తా కథనాలపై అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో స్పందించాలే తప్ప, భౌతిక దాడులు లేదా వేధింపులకు పాల్పడటం సమర్థనీయం కాదన్నారు.
జర్నలిస్టులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ, పౌరుల హక్కులు, ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన కీలక అంశమని పేర్కొన్నారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలను తేలికగా తీసుకోకుండా, బాధితుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న వైద్య నివేదికలు, సంబంధిత రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు. విచారణ ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా సాగాలని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మహేష్‌ బి.గితే విచారణకు ఆదేశించి, వేములవాడ డీఎస్పీని విచారణ అధికారిగా నియమించడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న గంభీరావుపేట ఎస్‌ఐ శ్రీకాంత్‌ను ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసి, అనంతరం సస్పెండ్ చేయడం స్వాగతించదగ్గ చర్యలని బాపురావు పేర్కొన్నారు. అయితే, ప్రాథమిక చర్యలతోనే వ్యవహారం ముగియకూడదని, విచారణలో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
జర్నలిస్టులు తమ వృత్తి నిర్వహణలో భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా పనిచేసే వాతావరణాన్ని పోలీసు యంత్రాంగం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులపై ఒత్తిళ్లు, బెదిరింపులు, వేధింపులు చోటుచేసుకోకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించారు. వార్తా కథనాల్లో తప్పులు ఉన్నాయని భావిస్తే వివరణ కోరడం, ఖండన ఇవ్వడం, చట్టబద్ధమైన పరిష్కారాలను ఆశ్రయించడం వంటి మార్గాలు ఉన్నాయని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో జర్నలిస్టులపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని బాపురావు జిల్లా ఎస్పీని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల హక్కులకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించారని ఈ విషయంపై విచారణ కొనసాగుతుందని విచారణ అనంతరం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె కరుణాకర్ రావు, వేములవాడ నియోజకవర్గం అధ్యక్షులు బొప్ప బిక్షపతి, కార్యదర్శి గొల్లపల్లి వేణు, జిల్లా నాయకులు కొప్పుల ప్రసాద్, మధు, టీఎంఎస్‌పీజెఏ రాష్ట్ర నాయకులు మిట్టపల్లి సురేందర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *