వ్యవస్థల మార్పునకు యువతే చోదకశక్తి
వ్యవస్థల మార్పునకు యువతే చోదకశక్తి
– అవినీతి, అణచివేతలపై యువతరం గళమెత్తాలి
– టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య
హుజూరాబాద్:
అవినీతి, అణచివేతలతో కుళ్లిపోయిన వ్యవస్థల్లో సమూల మార్పు రావాలంటే యువతరం చైతన్యవంతమై పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో నైతిక విలువలతో కూడిన శక్తిగా ఎదిగినప్పుడే సమాజంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని అన్నారు. హుజూరాబాద్‌లోని వీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మానవ హక్కుల వేదిక, దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పౌరహక్కుల ఉద్యమ నేత కే. బాలగోపాల్ 17వ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన అంబటి నాగయ్య మాట్లాడుతూ, పాలకుల అణచివేతకు తలొగ్గకుండా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య మార్గంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన బాలగోపాల్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం, నిజాన్ని నిర్భయంగా చెప్పే నిబద్ధతే ప్రజాస్వామ్యానికి రక్షణ అని పేర్కొన్నారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాటం…
వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో గణితశాస్త్ర ఆచార్యుడిగా ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, వ్యక్తిగత హోదా, సౌకర్యాలను పక్కనపెట్టి అట్టడుగు వర్గాల హక్కుల కోసం బాలగోపాల్ తన జీవితాన్ని అంకితం చేశారని వక్తలు కొనియాడారు. పల్లెపల్లెకూ తిరుగుతూ బూటకపు ఎన్కౌంటర్లు, పోలీసు నిర్బంధ మరణాలు, అక్రమ అరెస్టులపై నిజనిర్ధారణలు చేపట్టి బాధితుల తరఫున నిలిచారని గుర్తుచేశారు. తుపాకీ ఎవరి చేతిలో ఉన్నా హింసను సమర్థించలేమని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బాలగోపాల్ స్పష్టంగా ప్రకటించారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య అన్నారు. ఆలోచనా నిబద్ధతతో 1998లో మానవ హక్కుల వేదికను నిర్మించి దళితులు, ఆదివాసీలు, మైనారిటీల హక్కుల పరిరక్షణకు కృషి చేశారని వివరించారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు ముక్కెర రాజు మాట్లాడుతూ, 40 ఏళ్ల వయసులో న్యాయవాద పట్టా పొంది, ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా పేదలు, అభాగ్యులు, నిర్వాసితుల తరఫున న్యాయస్థానాల్లో వాదించిన గొప్ప మానవతావాది బాలగోపాల్ అని ప్రశంసించారు.
ఆదివాసీలకు విధించిన మరణశిక్ష రద్దు చేయాలి..
సంస్మరణ సభలో పలు కీలక తీర్మానాలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని భీరంఘాటి ఆదివాసీలకు విధించిన మరణశిక్షను తక్షణమే, బేషరతుగా రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అణగారిన వర్గాల హక్కులను హరించే విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన, శాంతియుత ప్రజాస్వామ్య మార్గంలో ఉద్యమాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. అణచివేతకు గురైన బాధితుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడటమే బాలగోపాల్‌కు అందించే నిజమైన నివాళి అని సభ పేర్కొంది. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు జీవన్ కుమార్, జేఏసీ నాయకుడు ఆవునూరి సమ్మయ్య, భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షుడు జీడీ సారయ్య, డీటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు రమాదేవి, భారత్ బచావో నాయకుడు భీమోజు సదానందం, ప్రజాసంఘాల నాయకులు పొడిశెట్టి వెంకట్రాజం, వేల్పుల రత్నం, టీఎస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
