పాములను చంపొద్దు.. సురక్షిత సహజీవనమే లక్ష్యం
పాములను చంపొద్దు.. సురక్షిత సహజీవనమే లక్ష్యం
వన్యప్రాణి వారోత్సవాల్లో అచ్చంపేటలో అవగాహన కార్యక్రమం
అచ్చంపేట: పాములను చూసి భయంతో చంపకుండా, వాటి ప్రాధాన్యతను గుర్తించి సంరక్షించాలని అటవీశాఖ అధికారులు సూచించారు. వన్యప్రాణి వారోత్సవాలు–2026లో భాగంగా అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ క్లబ్ సభ్యులకు పాముల సంరక్షణ, రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ సుమన్, జూనియర్ అసిస్టెంట్, అచ్చంపేట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హన్మంతు నాయక్ పాముల వివిధ జాతులు, విషపూరిత–విషరహిత పాముల గుర్తింపు, వాటి ప్రవర్తన, నివాస ప్రాంతాలపై అవగాహన కల్పించారు. పర్యావరణ సమతుల్యతలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, ఎలుకలు తదితర హానికర జీవుల నియంత్రణలో వాటి ప్రాధాన్యత ఎంతో ఉందని వివరించారు.
ఇళ్లలోకి పాములు ప్రవేశించినప్పుడు ప్రజలు ఆందోళన చెందకుండా వాటికి దూరంగా ఉండాలని, పాములను చంపకుండా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. పాముకాటుకు గురైనప్పుడు మూఢనమ్మకాలను ఆశ్రయించకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని తెలిపారు.
ప్రతి పాము ప్రమాదకరమైనది కాదని, పాముల పట్ల ఉన్న అపోహలను తొలగించి వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు ఆసక్తిగా పాల్గొని పాముల సంరక్షణకు సంబంధించిన పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రకృతి, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాగర్కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర, ఐఎఫ్ఎస్ తెలిపారు.
“పాములను భయంతో చంపడం కాదు.. వాటి ప్రాధాన్యతను తెలుసుకుని సురక్షితంగా సహజీవనం చేయడమే నిజమైన వన్యప్రాణి సంరక్షణ” అని కార్యక్రమం ద్వారా సందేశం ఇచ్చారు.

