హుజురాబాద్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్‌గా పుల్లూరి ప్రభాకర్ రావు
ఉత్కంఠకు తెర..
హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కొలువుదీరింది!
– ఆరు రౌండ్లలో ఓట్ల లెక్కింపు..
– వైస్ ప్రెసిడెంట్‌గా పుల్లూరి ప్రభాకర్ రావు విజయం
– జనరల్ సెక్రటరీగా కట్కూరి మల్లారెడ్డి..
హుజురాబాద్ నవంబర్ 15:
హుజురాబాద్ క్లబ్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఉదయం నుంచి ఆసక్తికరంగా సాగిన పోలింగ్.. సాయంత్రం ప్రారంభమైన ఓట్ల లెక్కింపుతో మరింత ఉత్కంఠను రేకెత్తించింది. ఆరు రౌండ్ల పాటు సాగిన కౌంటింగ్ ప్రక్రియ చివరకు రాత్రి 9.30 గంటలకు ముగియడంతో విజేతలెవరో తేలిపోయింది. క్లబ్ సభ్యులు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 94.48 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 326 మంది ఓటర్లకు గాను 308 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై నిర్ణీత సమయం వరకు ప్రశాంతంగా కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఒక్కో రౌండ్ ఫలితాలపై అభ్యర్థులు, వారి అనుచరులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆరు రౌండ్ల లెక్కింపు అనంతరం రాత్రి 9.30 గంటలకు తుది ఫలితాలు వెల్లడయ్యాయి.

ప్రముఖుల ఓటింగ్‌తో ప్రత్యేక ఆకర్షణ…
క్లబ్ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్, ఓడితల శ్రీనివాసరావు, కిషన్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రధాన పదవుల్లో విజేతలు వీరే..
వైస్ ప్రెసిడెంట్ పదవికి జరిగిన పోటీలో పుల్లూరి ప్రభాకర్ రావు 199 ఓట్లు సాధించి విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా కట్కూరి మల్లారెడ్డి 176 ఓట్లతో గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా శివనాధుని వేణు 174 ఓట్లు సాధించి విజయం సాధించగా, కోశాధికారిగా గర్రెపల్లి (తాడికల్) శ్రీనివాస్ 171 ఓట్లతో గెలుపొందారు.
ఈసీ మెంబర్లు వీరే..
క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో మొత్తం 9 పోస్టులు ఉండగా 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా అత్యధిక ఓట్లు సాధించిన గడ్డం ధర్మారెడ్డి, కేసిరెడ్డి నరసింహారెడ్డి, పుల్లూరు శ్రీకాంత్, మ్యాకల రాజిరెడ్డి, గోలి సురేష్, పొనగంటి శ్రవణ్ కుమార్, ఆకినపల్లి అనిల్, దొనకొండ సత్యనారాయణ రెడ్డి ఈసీ మెంబర్లు గా గెలుపొందారు.
ఇద్దరి మధ్య సమాన ఓట్లు.. ఉత్కంఠ!
ఈసీ సభ్యుల ఎన్నికల్లో మాగంటి శ్రీధర్, కోలే కళ్యాణ్ రావు చెరో 110 ఓట్లు సాధించి సమానంగా నిలిచారు. దీంతో వీరిద్దరి మధ్య సమాన ఓట్ల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితిలో తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
కొత్త కార్యవర్గంపై సభ్యుల ఆశలు..
ఎన్నికల ప్రక్రియ ముగియడంతో నూతనంగా ఎన్నికైన కార్యవర్గంపై క్లబ్ సభ్యులు ఆశలు పెట్టుకున్నారు. క్లబ్ అభివృద్ధి, సభ్యులకు మెరుగైన సౌకర్యాలు, పారదర్శక నిర్వహణ, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం వంటి అంశాలపై కొత్త కార్యవర్గం దృష్టి సారించాలని సభ్యులు ఆకాంక్షిస్తున్నారు.
