హామీలు అమలు చేస్తారా.. లేదా రాజీనామా చేస్తారా.?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
– హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
– 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన
– కాంగ్రెస్ బాకీ కార్డులతో ధర్నా
హుజరాబాద్:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు బుధవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన చేపట్టారు. హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా “420 హామీలు 420 ఫిట్లు” అనే భారీ ఫ్లెక్సీని ప్రదర్శించి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజలకు పంపిణీ చేస్తూ ప్రభుత్వం అమలు చేయని హామీలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు పచ్చి మోసం అని, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు దేవాలయాల్లో దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేసి ప్రజలకు గ్యారెంటీ కార్డులు అందజేశారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు దాదాపు వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. “వచ్చే నెల.. 100 రోజులు” అంటూ ప్రజలను నమ్మించి ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, రైతులకు రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. ప్రజలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచిందని పేర్కొన్న కౌశిక్ రెడ్డి, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్, వాల బాలకిషన్ రావు, పోల్నేని సత్యనారాయణ రావు, తిరుపతిరావు, పింగిలి రమేష్, ఏడవెల్లి కొండల్ రెడ్డి, పోల్సాని రామారావు, సంగెం ఇలయ్య, ఎరుమల్ల సురేందర్ రెడ్డి, గుడూరి ప్రతాప్ రెడ్డి, తాటికొండ పుల్లాచారి, కట్కూరి మల్లారెడ్డి, మంతెన శ్రీనివాస్, పోరెడ్డి దయాకర్ రెడ్డి, దాసరి రమణారెడ్డి, అనుమండ్ల శ్యామ్‌సుందర్ రెడ్డి, బండి రమేష్, పాకాల లక్ష్మారెడ్డి, మండ సతీష్, కానుగంటి శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, ములుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, కుమారస్వామి, రాధాకృష్ణ, సుధాకర్, నారాయణ, సంజీవ రెడ్డి, సత్యనారాయణ, ఆర్.కే. రమేష్, గందే శ్రీనివాస్, వర్దినేని రవీందర్ రావు, కొలిపాక శ్రీనివాస్, ప్రతాప తిరుమల్ రెడ్డి, పోరెడ్డి శాంతన్ రెడ్డి, కేసిరెడ్డి లావణ్య నరసింహ రెడ్డి, అపరాజ ముత్యం రాజు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

