వెయ్యి కోట్ల అభివృద్ధి హామీ ఏమైంది?
బీఆర్‌ఎస్ నేతలు ధర్నాలు చేయడం సిగ్గుచేటు
– కాంగ్రెస్ ప్రజాపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు
– వెయ్యి కోట్ల అభివృద్ధి హామీ ఏమైంది?..
– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్‌గౌడ్
హుజురాబాద్:
పదేళ్లపాటు ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్‌గౌడ్ విమర్శించారు. జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే రూ.వెయ్యి కోట్లతో నియోజకవర్గాన్ని అద్దంలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన పాడి కౌశిక్‌రెడ్డి.. వెయ్యి రోజులు గడిచినా కనీసం వెయ్యి రూపాయల నిధులు కూడా తీసుకురాలేదని ఆరోపించారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కోల్పోయారని అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోను తొలగించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫొటో పెట్టుకోవాలనుకుంటే ప్రభుత్వ అధికారిక క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అధికారిక కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫొటో కొనసాగిస్తే తామే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి స్వయంగా లబ్ధిదారులకు అందజేస్తూ, అదే పథకాలు అందడం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో ఒకవైపు ఇసుక ట్రాక్టర్లతో రోడ్లు దెబ్బతింటున్నాయని ఫొటోలు ప్రదర్శిస్తూ.. మరోవైపు ఇసుక దొరకడం లేదని చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన హామీలను ముందుగా ఆ పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలని మహేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందని, నిరుద్యోగ భృతి ఎంతమందికి అందించారని, ఎన్ని డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇచ్చారని, ఎంతమంది దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేశారని ప్రశ్నించారు. జిల్లా కో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య వంటి హామీల పరిస్థితి ఏమిటో చెప్పి బీఆర్‌ఎస్ నేతలు ప్రజల్లోకి రావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, దీనిని ఓర్వలేకే బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీలో తక్కువ సమయం మాత్రమే పాల్గొన్నప్పటికీ ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాధనం భారీగా ఖర్చయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ హద్దులు దాటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో విలేకరులను మోసం చేసి దొంగ పట్టాలు ఇచ్చి, ఇప్పుడు వారిని రోడ్డెక్కించే పరిస్థితి కల్పించిన కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్‌పై విమర్శలు చేసే హక్కు లేదన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ మంత్రులు, ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అభివృద్ధి పనులు సాధిస్తుంటే.. వాటిని తానే చేసినట్లు కౌశిక్‌రెడ్డి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తన సొంత మండలంలోని కల్వల ప్రాజెక్టు, చెల్పూర్ పెద్దచెరువు మరమ్మతులు చేపడతానని హామీ ఇచ్చిన కౌశిక్‌రెడ్డి ఇప్పటివరకు వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇకనైనా చిల్లర మాటలు, చిల్లర ప్రచారం మానుకుని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని మహేందర్‌గౌడ్ అన్నారు.
