విద్య, వైద్యం పేదలకు చేరువ చేయడమే జయన్న ఫౌండేషన్ ధ్యేయం..

0

విద్య, వైద్యం పేదలకు చేరువ చేయడమే జయన్న ఫౌండేషన్ ధ్యేయం
– సిర్సపల్లిలో రూ.7 లక్షల వ్యయంతో ఆధునిక వాటర్ ప్యూరిఫైయర్ ప్రారంభం
ప్రజాసేవే లక్ష్యంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం : గుడిపాటి సరిత-జయపాల్ రెడ్డి
హుజూరాబాద్:
గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం, స్వచ్ఛమైన తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే జయన్న ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సరిత, జయపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం హుజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆధునిక వాటర్ ప్యూరిఫైయర్‌ను వారు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో సరిత మాట్లాడుతూ, తన భర్త జయపాల్ రెడ్డి సమాజసేవను జీవిత లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారని, ఆయన సేవా కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతగా అండగా నిలుస్తున్నానని తెలిపారు.
ఫౌండేషన్ ద్వారా హుజూరాబాద్ మండలంలోని అనేక గ్రామాల్లో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని వెల్లడించారు.
ఈ సందర్భంగా జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ, తాను సామాన్య రైతు కుటుంబంలో జన్మించి చిన్ననాటి కష్టాలను అనుభవించానని, ఆ అనుభవాలే సమాజసేవ వైపు నడిపించాయని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మండలంలోని వందలాది పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థికి రూ.700 చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. సమాజసేవలో భాగంగా ఇప్పటివరకు 1,285 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించామని, పలు గ్రామాల్లో లక్షల రూపాయలు వెచ్చించి వాటర్ ప్యూరిఫైయర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే 20 ఫ్రీజర్లను కొనుగోలు చేసి హుజూరాబాద్ ప్రజలకు రవాణా ఖర్చులు మాత్రమే తీసుకుని అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. హుజూరాబాద్ ప్రాంత ప్రజలకు ముప్పుగా మారే డంపింగ్ యార్డు ఏర్పాటును అడ్డుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే ఫౌండేషన్ ధ్యేయమని, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. గ్రామ సర్పంచ్ కొలసాని రామారావు మాట్లాడుతూ, స్వార్థం పెరిగిన ఈ కాలంలో ప్రజల కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ సేవ చేస్తున్న జయపాల్ రెడ్డి అభినందనీయుడని కొనియాడారు. ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు అనేక కుటుంబాలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా గుడిపాటి సరిత, జయపాల్ రెడ్డిలను గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జనగామ రాజేశ్వరరావు, సర్పంచులు కె. మల్లారెడ్డి, కస్తూరి, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకట్రావు, హనుమంతరావు, విజయ్ కుమార్, వేల్పుల రత్నం, కౌన్సిలర్ ఖాలిద్ హుస్సేన్, ఇంద్రసేనారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *