నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు
నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు
– కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు ఇమ్రాన్ విమర్శ
హుజూరాబాద్:
నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకత్వానికి లేదని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఇమ్రాన్ తీవ్రంగా విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో టీజీపీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక ప్రక్రియల్లో జాప్యం, కోర్టు వివాదాలు, నిరుద్యోగ భృతి అమలులో వైఫల్యం వంటి అంశాలతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ప్రవళిక, సునీల్ నాయక్ వంటి నిరుద్యోగుల ఆత్మహత్యలు రాష్ట్రాన్ని కలచివేశాయని, వాటికి అప్పటి ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రవళిక ఆత్మహత్య ఘటనపై అప్పటి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర ఆవేదన కలిగించాయని విమర్శించారు. ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో జరిగిన అవకతవకల కారణంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తు చేస్తూ, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కొత్త జోనల్ వ్యవస్థ అమలు, గురుకుల పాఠశాలలను తగిన భవనాలు లేకుండానే నిర్వహించడం, విద్యార్థుల స్కాలర్షిప్ల జాప్యం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి వంటి అనేక అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. అలాంటి పాలన సాగించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల సంక్షేమంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని, ముందు తమ పాలనలో జరిగిన ఘటనలకు ప్రజలకు సమాధానం చెప్పాలని మహ్మద్ ఇమ్రాన్ డిమాండ్ చేశారు.
