పర్యావరణ యోధుల రక్షణకు తక్షణ చర్యలు అవసరం

0

పర్యావరణ యోధుల రక్షణకు తక్షణ చర్యలు అవసరం
– పర్యావరణ వేత్త సత్యనారాయణ పై దాడి అమానుషం
– ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు
హన్మకొండ:
సూర్యాపేట జిల్లా, మోతే మండలం రాఘవాపురం గ్రామంలో ప్రముఖ పర్యావరణవేత్త, జలసాధన సమితి వ్యవస్థాపకులు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జేఎన్టీయూహెచ్ మాజీ సహాయ ఆచార్యులు, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన ప్రతి ప్రకృతి ప్రేమికుడిని కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. దుశ్చర్ల సత్యనారాయణ పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తూ, సుమారు 70 ఎకరాల బీడు భూమిని సస్యశ్యామలం చేసి హరితవనంగా మార్చిన అరుదైన వ్యక్తిగా గుర్తింపు పొందారన్నారు. ఆయన సృష్టించిన వనం వన్యప్రాణులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, స్థానిక ప్రజలకు జీవనాధారంగా నిలిచిందని తెలిపారు. అలాంటి వ్యక్తిపై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటన పర్యావరణాన్ని కాపాడే వారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని, చట్టాల అమలు బలహీనంగా ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం సహజమని పేర్కొన్నారు. ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వాల్టా వంటి చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం, అటవీ శాఖ, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి మెరుగైన వైద్యం, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పర్యావరణ పరిరక్షకుల కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. పర్యావరణ యోధులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజం మరియు భవిష్యత్తు తరాల కోసం కృషి చేస్తున్నారని, వారిపై దాడులు జరగడం సమాజ భవిష్యత్తుపైనే దాడిగా భావించాలన్నారు. దుశ్చర్ల సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఇలాంటి పర్యావరణ సేవకులను రక్షించేందుకు ప్రభుత్వం, సమాజం కలిసికట్టుగా ముందుకు రావాలని పిట్టల రవిబాబు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *