నిషేధిత జాబితా భూములను రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు
నిషేధిత జాబితా భూములను రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు
– ఆ భూముల జాబితాను నవీకరించాలి
– రిజిస్ట్రేషన్, రెవిన్యూ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి
– జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
-కరీంనగర్:
నిషేధిత భూముల జాబితా భూములను రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ భూముల జాబితాను నవీకరించాలని, రెవిన్యూ, రిజిస్ట్రేషన్, మునిసిపల్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, తహసిల్దార్లు, మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరపాలని ఆదేశించారు. ప్రతి నిషేధిత జాబితా సర్వే నెంబర్లను క్రోడీకరించి, నవీకరించిన సమగ్ర జాబితా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారుల వద్ద నవీకరించిన నిషేధిత భూముల జాబితా ఉండాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు నిర్ణయించాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంటి నెంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి వస్తే సంబంధిత నిర్దిష్ట డాక్యుమెంట్లతో పాటు మునిసిపల్ లేదా గ్రామపంచాయతీ నుండి ఎన్ఓసి తీసుకోవాలని ఆదేశించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు నిషేధిత జాబితా సర్వేనెంబర్ లను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు భూములు కొనుగోలు చేసే ముందు ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నవో లేవో పరిశీలించుకోవాలని, ఎలాంటి సమస్యలు లేని భూములనే కొనుగోలు చేయాలని సూచించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
