సోదరభావం, పవిత్రతే రక్షాబంధన్ సందేశం
సోదరభావం, పవిత్రతే రక్షాబంధన్ సందేశం
– బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు
-హుజూరాబాద్:
ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెదలాలనే సందేశాన్ని తెలియజేయడమే రక్షాబంధన్ ఉద్దేశ్యమని బ్రహ్మకుమారీలు శ్రీవాణి అన్నారు. బుధవారం రాఖీ పండగ విశిష్టతను వివరిస్తూ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పలువురికి రాఖీలు కట్టారు. అనంతరం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ రమేష్ బాబు, తహసిల్దార్ కనకయ్య, సబ్ ట్రెజరీ అధికారి శివరామకృష్ణ, డిప్యూటీ తహసిల్దార్ సాయి, ఆర్ఐ రంజిత్ రెడ్డి, శేఖర్ లతో పాటు సిబ్బందికి రాఖీలు కట్టారు. స్థానిక కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి బీపీ కిరణ్ కుమార్ తో పాటు న్యాయవాదులకు సిబ్బందికి రాఖీలు కట్టారు. పట్టణ సిఐ టి కరుణాకర్ బిఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్ లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ యొక్క విశిష్టతను తెలియజేస్తూ అక్కా చెల్లెలు, అన్నదమ్ముల బంధం గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ప్రతి పండుగ పరమాత్ముని అవతరణ, దివ్య కర్తవ్యాన్ని సూచిస్తుందన్నారు. రక్షణ అంటే విలువలను పెంపొందించుకోవడం, మనం ఏర్పరచుకున్న విలువలను కాపాడుకుంటూ జీవించడం అన్నారు. పరస్పర మాటలు, దృష్టి స్వభావ సంస్కారాలు నిష్కల్మషంగా ఉండాలనే రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారని తెలిపారు. ప్రజలందరూ పరమాత్ముని యందు సంపూర్ణ నిష్ఠ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతి రాణి, రాజయ్య, నిరంజన్, హుజురాబాద్ పోస్ట్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

