వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలి
వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలి
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
– ఆసుపత్రి డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు
– ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
– ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
-పెద్దపల్లి:
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లోని ప్రతి వార్డు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ లను కలెక్టర్ పరిశీలించారు.ఔట్ పేషెంట్ విభాగంలో ఉదయం 9.30 తర్వాత ఆరుగురు వైద్యులు ఆలస్యంగా రావడం గమనించి ఇలాంటివి పునారవృతం కాకుండా ఉండాలని మరియు అవసరం అయితే క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ మరియు ఆర్. ఎం.ఓ లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. ఔట్ పేషెంట్ సేవలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలని, ఆసుపత్రి వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యుల హాజరు పై సరైన పర్యవేక్షణ ఉండాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలులోకి తీసుకొని రావాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత పెంచుకోవాలని, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రీమియం రేంజ్ లో సేవలు మరియు పారిశుధ్య సేవలు కూడా ఉండాలని, దీనికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తామని అన్నారు. ప్రభుత్వ వైద్యులు డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అదే విదంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది పేషెంట్లతో మర్యాద పూర్వకంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. అనంతరం ఆయూష్ ఆసుపత్రి విభాగం పరిశీలించిన కలెక్టర్ రోగులతో అందుతున్న వైద్య సేవలు గురించి చర్చించారు. ఆయూష్ ఆసుపత్రిలో నెల రోజులకు అవసరమైన మందులు కొనుగోలు చేసి అందుబాటులో పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
