రైతును రారాజును చేయడమే మోదీ లక్ష్యం
రైతును రారాజును చేయడమే మోదీ లక్ష్యం
– 11 ఏళ్లలో రైతుల కోసం రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన మోదీ ప్రభుత్వం
– ఎరువుల కోసమే సబ్సిడీ రూపంలో రూ.11 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేశాం
– కనీస మద్దతు ధర అందించేందుకు రూ.16 లక్షల 35 వేల కోట్లు ఖర్చు చేసిన మోదీ సర్కార్
– కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల 69 వేల 561 కోట్లు జమ
– టెన్త్ బాగా చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు యత్నిస్తా
– సైకిళ్ల పంపిణీకి దేశవ్యాప్త ప్రచారం లభిస్తోంది
– ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి మరింత కృషి చేస్తా
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
– చొప్పదండిలో పదో తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి
-చొప్పదండి:
ఎద్దు ఏడ్చిన వ్యవసాయం… రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గత 11 ఏళ్లలో రైతుల సంక్షేమం, వ్యవసాయం, అనుబంధ రంగాలకు దాదాపు రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత మోదీ సర్కార్ కే దక్కిందన్నారు. రైతును రారాజు చేయడమే లక్ష్యంగా నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి పేరిట గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా 9 కోట్ల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3.89 లక్షల కోట్లను జమ చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రములో ఇప్పటివరకు 30 లక్షల 80 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.13 వేల కోట్లు జమ చేసినట్లు వివరించారు. ప్రధానమంత్రి కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగాన్ని వర్చువల్ గా బండి సంజయ్ తిలకించారు. అనంతరం మోదీ బటన్ నొక్కి 20వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో లక్షా 81 వేల 305 మంది రైతుల ఖాతాల్లో రూ.36 కోట్ల 26 లక్షల 10 వేలను.. ఒక్క చొప్పదండి మండలంలోనే 4 వేల 612 మంది రైతుల అకౌంట్లలో రూ.92 లక్షల 24 వేలను జమ చేసినట్లు పేర్కొన్నారు. ఆదివారం కాశీ విశ్వనాథుడి ప్రసాదంగా కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును రైతులకు అందజేయడం గొప్ప కార్యక్రమం. ప్రపంచంలోనే ఇంత పెద్ద గొప్ప స్కీం మరొకటి లేదు. దళారులు, పైరవీలతో పనిలేకుండా నేరుగా ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలిసారి 2019 ఫిబ్రవరిలో ఈ మహోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించామని.. అప్పటినుంచి ఇప్పటివరకు ఇబ్బందులు ఎదురైనా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులను జమ చేస్తున్నట్లు వివరించారు. ఐదేళ్లలో 19వ విడతలుగా ఈ స్కీం కింద రూ.3 లక్షల 69 వేల 561 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేశామని.. 20వ విడత కింద ఈరోజు మరో 20 వేల 834 కోట్ల రూపాయలను 9 కోట్ల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. గత 19 దఫాలుగా ఒక్క తెలంగాణ రైతాంగానికి 13 వేల 8 కోట్ల 29 లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈరోజు మరో రూ.620 కోట్లను జమ చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికలు, ఓట్లతో సంబంధం లేకుండా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని అన్నారు.
రష్యా ,ఉక్రెయిన్ యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల కారణంగా
అంతర్జాతీయ మార్కెట్లలో యూరియా ధరలు పెరిగినా.. మన దేశ రైతులపై భారం పడకుండా మోడీ ప్రభుత్వం తక్కువ ధరలకే ఎరువులు పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు.ఎరువుల సబ్సిడీ పేరుతో ఒక్కో ఎకరాకు 18 వేల చొప్పున.. 5 ఎకరాలున్న రైతుకు ఒక్క సీజన్ కే 90 వేల రూపాయలు ఆదా అవుతున్నాయని పేర్కొన్నారు
పంటలకు మద్దతు ధర అందిస్తున్నాం..
మోదీ ప్రభుత్వం 11ఏళ్లలో వడ్లు, గోధుమలుసహా రైతులు పండించే పంటలన్నింటికీ కనీస మద్దతు ధర అందించేందుకు16 లక్షల 35 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేసింది. ఒక్క మన రాష్ట్రంలోనే వడ్ల కొనుగోలు కోసం లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా మోదీ ప్రభుత్వం ఖర్చు చేసింది. యూపీఏ హయాంలో క్వింటాలు వడ్లకు కనీస మద్దతు ధర 1310 రూపాయలుంటే, మోదీ పాలనలో నేడు 2300 రూపాయలకు పైగా ఇస్తున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఢిల్లీలో ఎంపీలు సైకిళ్ల పంపిణీ గురించి అడుగుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో
టెన్త్ విద్యార్థులకు అందించే సైకిళ్ల పంపిణీకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా విస్త్రత ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో చాలా మంది ఎంపీలు ఇదే విషయంపై అడుగుతున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. సైకిళ్ల పంపిణీకి ప్రధాన కారణం ప్రజా సంగ్రామ యాత్రలో నిర్మల్ నిర్మల్ జిల్లాలో అనుభవాలేనని.. క స్కూల్ వెళ్లడానికి సైకిల్ లేక చదువుకు దూరమైన విద్యార్ధి దుస్థితిని చూసిన తరువాతే సైకిళ్ల పంపిణీ చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులు..
ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారని.. అక్కడ చదివితే విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా మారుతారని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఇంటి నుండి స్కూల్ వరకు నడిచే అవకాశం లేకుండా సైకిళ్లను అందజేస్తున్నట్లు చెప్పారు. సైకిల్ వల్ల సమయం ఆదా అవు తుందన్నారు. స్పెషల్ క్లాసులకు ఇబ్బంది లేకుండా హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాగా చదివి టెన్త్ ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు ఇంటర్ లో స్కూటీ ఇచ్చేందుకు కృ షి చేస్తానని హామీ ఇచ్చారు. తలదించుకొని పుస్తకాలు చదవండి తల ఎత్తుకునేలా ఉన్నత స్థానాల్లో నిలుస్తారు. విద్యార్థులు తలదించుకొని పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తల ఎత్తుకునేలా ఉన్నత స్థానాల్లో ఉంటారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తు చేసుకొని చదివితే మీకు తిరుగుండదన్నారు. అంబేద్కర్ లాంటి మహనీయుడు ఎన్ని అవమానాలు పడినా, సమాజం చీదరించుకున్నా, హేళనకు గురైనా చదువును వదల లేదని గుర్తు చేశారు. ఉన్నత చదువులు చదివి మనకు రాజ్యాంగాన్ని అందించారని.. అలాంటి మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం చొప్పదండి మండలంలోని పలువురు విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
కేంద్ర మంత్రి గొప్ప సంకల్పం.. చేశారు..
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ..కేంద్రమంత్రి గొప్ప సంకల్పం చేసి పార్లమెంట్ పరిధిలో పదో తరగతి విద్యార్థులకు 20వేల సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. సైకిళ్లు పంపిణీ చేస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందన్నారు. త్వరలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతులకు వెళ్లేందుకు సైకిళ్లు ఉపయోగపడతాయన్నారు.
కష్టాలు చూసి భయపడకుండా లక్ష్యం ఎంచుకొని ముందుకు సాగితే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. డీఈవో చైతన్య జైనీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని పలువురు సన్మానించారు. అనంతరం పలువురు విద్యార్థులు కేంద్రమంత్రికి రాఖీలు కట్టారు.
