నేరుగా విత్తుకునే వరి సాగుతో అధిక లాభాలు

0

నేరుగా విత్తుకునే వరి సాగు లాభదాయకం..
– కె వి కె సేద్య విభాగ శాస్త్రవేత్త జె విజయ్
-హుజురాబాద్:
నేరుగా విత్తుకునే వరి సాగు చేపట్టడం చాలా లాభదాయకమని కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగ శాస్త్రవేత్త జె విజయ్ సూచించారు. శుక్రవారం ఉప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో రైతులకు వర్షాలు మేళకువలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన చాలామంది రైతులు వరిసాగు వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఇప్పటికే నార్లు పోసుకునే సమయం దాటిపోయిందన్నారు. ఇప్పుడు నేరుగా విత్తుకునే వరి సాగు చేపట్టడం చాలా లాభదాయకమన్నారు. ఈ పద్ధతిలో సాగు చేసుకోవాలనుకునే రైతులు స్వల్పకాలిక వరి రకాలను వేసుకోవాలన్నారు. నేరుగా విత్తే (బురద పదనులో వెదజల్లడం, డ్రం సీడర్ పద్ధతి) పద్దతులలో ఆగష్టు మొదటి వారం వరకు సాగు చేసుకోవచ్చన్నారు. స్వల్ప కాలిక రకాలు (120-125 రోజులు), సన్న గింజ రకాలు: తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్-15048), కూనారం రైస్-2 (కేఎన్ఎం-1638), విజిఎల్-962, దొడ్డు గింజ రకాలు: జగిత్యాల రైస్ -1 (జేజిఏల్-24423), కూనారం సన్నాలు (కెఎన్ఏం-118), ఏంటుయు-1010 అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విధానంలో నాటు విధానం లాగానే పొలాన్ని దమ్ము చేసుకోవాలని, పొలంలో ఎత్తుపల్లాలు లేకుండా సమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. దమ్ము చేసుకున్న పొలంలో వెదజల్లే పద్ధతికి ఎకరాకు 8-10 కిలోల విత్తనం సరిపోతుందన్నారు. డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునప్పుడు 10-15 కిలోల విత్తనం చాలన్నారు. కాండం గట్టిగా ఉండి వేరు వ్యవస్థ దృఢంగా ఉండి పడిపోని రకాలు అనుకూలమన్నారు. విత్తనాలను 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండే కట్టి కొద్దిగా ముక్కు పగిలిన గింజలను దమ్ము చేసిన పొలంలో వెదజల్లుకోవాలన్నారు. డ్రమ్ సీడర్ తో విత్తుకున్నప్పుడు డ్రమ్ములో 3/4 వంతు గింజలు నింపి మూత బిగించాలన్నారు. ఈ పరికరానికి 4 డ్రమ్ముల్లో 8 వరుసలలో వరుసకు వరుసకు మధ్య 20 సెం. మీ దూరంలో విత్తనాలు పడతాయన్నారు. రకాన్ని బట్టి గింజలు పడే విధానాన్ని బట్టి రంద్రాలను స్టాపర్ తో మూసుకోవాలన్నారు. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పులో కాలిబాటలు వదులుకోవాలన్నారు. వెదజల్లే పద్ధతిలో బంకనేలల్లో అయితే దమ్ము చేసిన మరుసటి రోజు వెదజల్లుకోవాలన్నారు. విత్తే సమయానికి నీరు లేకుండా బురద ఉంటే చాలని, ఇసుక శాతం ఎక్కువగా ఉండే నేలల్లో విత్తనం వేసే రోజు దమ్ము చేసి చదును చేసి పలుచని నీటిపొర ఉండేటట్లు చూసుకొని విత్తుకోవాలన్నారు. డ్రం సీడర్ పద్ధతిలో విత్తే సమయంలో నీరు లేకుండా బురదగా ఉంటే సరిపోతుందన్నారు. అధిక వర్షాల వలన విత్తనం కొట్టుకుపోయే అవకాశం ఉంటుందని, వర్షాలు ఆగిన తర్వాత విత్తుకోవాలన్నారు. ఈ పద్ధతిలో కూడా నేరుగా విత్తే వరిలో లాగానే సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులు వేసుకోవాలన్నారు. మొదటి దఫా నత్రజని విత్తేటప్పుడు కాకుండా విత్తిన 15 రోజుల తర్వాత వేసుకోవాలన్నారు. విత్తిన 3 లేదా 4 వ రోజు పైరజో సల్ఫో ఇథైల్ 80-100 గ్రా. కలుపు మందును పిచికారి చేసుకోవాలన్నారు. విత్తిన 15 నుండి 20 రోజులకు ఫెనాక్సులం + సైహలోఫాప్ బ్యుటైల్ 800 మి.లీ మందును ఎకరాకు పిచికారి చేసుకోవాలన్నారు. లేదా ట్రైయఫామోన్ + ఈథాక్స్ సల్ఫ్యురాన్ అనే కలుపు మందును 90 గ్రాములు మందును ఎకరాకు పిచికారి చేసుకోవాలన్నారు. విత్తిన తర్వాత మొదట్లో బురదగా ఉంచాలన్నారు. నీరు నిల్వ ఉంటే మొలకరాదని, తర్వాత పలుచగా 2-3 సెంటీమీటర్లు నీరు పిలకలు తొడిగే దశ వరకు ఉంచితే సరిపోతుందన్నారు. పైరు పొట్ట దశ నుండి కోత వరకు నాటు వేసిన పొలం మాదిరిగానే నీటి యాజమాన్యం చేసుకోవాలన్నారు.
సాధారణ నాటు పద్ధతి కంటే 10 నుండి 15 శాతం అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. కూలీల కొరతను అధిగమించి సకాలంలో విత్తుకోవచ్చన్నారు. ఈ పద్ధతిలో నారు పెంపకం లేనందున పంటకాలం 7-10 రోజులు తగ్గుతుందన్నారు. విత్తన మోతాదు తగ్గుతుందని, ఎకరాకు 6-8 వేల రూపాయలు ఆదా చేయవచ్చన్నారు. చదరపు మీటరుకు ఉండాల్సిన మొక్కల సాంద్రత కూడా పెరుగుతుందన్నారు. డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా వరి సాగు చేసే ఆసక్తి గల రైతులకు డ్రమ్ సీడర్ లు రోజువారి అద్దె రూపంలో హుజురాబాద్ రైతు వేదిక లో అందుబాటులో యూన్నాయని హుజురాబాద్ ఏఈఓ నిఖిల్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *