తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతాం

0

తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతాం
– రైతు రుణ విముక్తి దేశ చరిత్రలో నిలిచిపోతుంది
ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం
– యువత భవిష్యత్తుకు గ్యారంటీ
కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
-కరీంనగర్:
తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వాణిజ్య శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడించారని తెలిపారు. ఇందులో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారని, ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని వివరించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టీస్ పాలసీ, గ్రీన్ ఎనర్జిపాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసిందని, ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుందని అన్నారు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందని, అందుకే, రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంటగ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాలతో పాటు, సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మహిళలు పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారని, శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్ళను ప్రభుత్వం ప్రారంభించిందని, మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి, ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేశామని తెలిపారు. దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో 25 లక్షల 35 వేల 964 మంది రైతులను రుణ విముక్తులను చేశామని, 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని తెలిపారు. రైతుకు పెట్టుబడి సాయం పెంచి, రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నామని అన్నారు. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇస్తున్నామని, సన్నధాన్యానికి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని అన్నారు. పేదల ఆకలి తీర్చటంతోపాటు, వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం పథకాలను అమలుచేస్తున్నామని వివరించారు. సంక్షేమంతోపాటు సామాజిక న్యాయంలో సయితం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోందని, దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, పారదర్శకంగా కులగణన నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలని, వారి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ, యువత ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని,
మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ప్రయివేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నామని అన్నారు. రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని, తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీ స్టేట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టామని, 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టి 58 పాఠశాలల నిర్మాణం చేపట్టామని వివరించారు. పాఠశాలల అభివృద్ధికి విద్యాకమిషన్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నామని, రాష్ట్రంలో 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే గృహనిర్మాణాలు ప్రారంభించామని, నిర్మాణ దశలను బట్టి లబ్దిదారుల ఖాతాలలో నగదు జమ చేస్తున్నామని వివరించారు. విశ్వ వేదికపై తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించామని, అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాలలో పర్యటించి బారీగా పెట్టుబడులు సాధించామని తెలిపారు. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించామని, ఏఐ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని 7 వేల 626 స్వయం సహాయక సంఘాలకు 785.66 కోట్ల ఋణాలను మంజూరు చేశామని, 7 వేల 999 మంది మహిళలకు 66 కోట్ల 18 లక్షల రూపాయల స్త్రీనిధి ఋణాలను ఇచ్చామని, తద్వారా మహిళలు క్యాంటీన్లు, స్వగృహ ఫుడ్స్, డెయిరీ యూనిట్లు, కోళ్ళ పెంపకం వంటివి ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ది చెందుతున్నారని తెలిపారు. ఈ యాసంగిలో స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి 156 కోట్ల విలువైన 6 లక్షల 72 వేల 684 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామని అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 4 కోట్ల 30 లక్షల 64 వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, తద్వారా మహిళలకు 158 కోట్ల 58 లక్షల రూపాయల లబ్ధి చేకూరిందని అన్నారు. మన జిల్లాలో ఒక లక్షా 56 వేల 83 మంది లబ్దిదారులకు 5 లక్షల 32 వేల 66 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేశామని, వాటి విలువ 16 కోట్ల 44 లక్షల రూపాయలు కాగా ఈ సొమ్మును గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. మన జిల్లాలో డీఎస్సీ ద్వారా 221 మంది టీచర్ పోస్టులకు ఎంపికయ్యారని, దీంతో పాటు టి.ఎస్.పి.ఎస్.సి. ద్వారా నిర్వహించిన వివిధ రకాల పోటీ పరీక్షలకు మన జిల్లా నుండి చాలా మంది అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. ఇటీవల 172 మంది గ్రామ పాలన అధికారుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహించామని, ఎస్టీ, ఎస్సీ, బీసి మరియు మైనారిటీ స్టడీ సర్కిళ్ల ద్వారా వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు కావాల్సిన పుస్తకాలను ఉచితంగా అందిస్తూ, నిపుణులైన అధ్యాపక బృందంచే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో జిల్లాలోని మానకొండూర్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను స్థాపిస్తున్నామని తెలిపారు. మన జిల్లాలో 273 మంది యువతను లైసెన్స్ డ్ సర్వేయర్లుగా ఎంపిక చేసి నిపుణులచే శిక్షణ ఇవ్వడం ఇస్తున్నామని వివరించారు. జిల్లాలో రైతు ఋణ మాఫీ పథకం కింద మొత్తం 77 వేల 726 మంది రైతులకు 605 కోట్ల 71 లక్షల రూపాయల ఋణాలు మాఫీ చేశామని, రైతు భరోసా పథకం ద్వారా 2024-25 యాసంగి సీజన్ కు గాను ఒక లక్ష 65 వేల 850 మంది రైతులకు 132.13 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. ఈ వానాకాలం వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు 26 వేల 957 మెట్రిక్ టన్నులు కాగా 30 వేల 403 మెట్రిక్ టన్నుల నిల్వలను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. భూ భారతిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఇందులో భాగంగా జిల్లాలోని సైదాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆ మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పూర్తి చేశామన్నారు. భూ సమస్యలున్న 1,798 మంది రైతుల నుండి ఆర్జీలు స్వీకరించి, భూ భారతి పోర్టల్ ద్వారా ధరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 328 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 8 వేల 683 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 51 వేల 965 మంది రైతులకు 716.12 కోట్ల రూపాయలను నేరుగా రైతు ఖాతాలో జమ చేశామని అన్నారు. మన జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో చేసుకున్న ధరఖాస్తులను అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రేషన్ కార్డులో కొత్తగా పేర్ల నమోదుకు 41 వేల 985 ధరఖాస్తులు రాగా కుటుంబ సభ్యులను రేషన్ కార్డులలో నమోదు చేసి బియ్యం సరఫరా చేస్తున్నామని వివరించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 77 వేల 83 మంది ధరఖాస్తు చేసుకున్నారని, ఇందులో జిల్లాకు మొదటి దఫా 11 వేల 575 ఇండ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో 7 వేల 843 మందికి 22 కోట్ల 33 లక్షల విలువ చేసే శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించిందని తెలిపారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికి జీరో బిల్లులు జారీ చేశామని, తద్వారా జిల్లాలో ఒక లక్షా 64 వేల 519 విద్యుత్ సర్వీసులకు గాను 74 కోట్ల 35 లక్షల 58 వేల 159 రూపాయలను సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని అన్నారు. ప్రసంగానికి ముందు మంత్రి శ్రీధర్ బాబు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబ సభ్యులను మంత్రి సన్మానించారు. కరీంనగర్ బాలభవన్ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మెడల్స్ ప్రదానం చేశారు. దివ్యాంగుల ఆర్థిక సాధికారతకు స్వయం ఉపాధి నిమిత్తం ఐదుగురికి రూ. 50 వేలు చొప్పున మంజూరు ఉత్తర్వులు అందజేశారు. మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించిన చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పలు శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ పనితీరును వివరించే స్టాళ్లను మంత్రి సందర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *