పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ ను సన్మానించిన ప్రొఫెసర్ పిట్టల
పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ ను సన్మానించిన ప్రొఫెసర్ పిట్టల రవిబాబు
– చేనేత కుటుంబాల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గూడూరు శ్రీనివాస్ ను హైదరాబాద్ సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో ప్రొఫెసర్ పిట్టల రవిబాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ పర్యావరణవేత్త, జేఎన్‌టీయూ మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ పిట్టల రవిబాబు మాట్లాడుతూ.. విదేశీ, కృత్రిమ వస్త్రాల వినియోగం పెరగడంతో ప్రకృతి, పర్యావరణం, భారతీయ సంస్కృతి, సంప్రదాయ విలువలు దెబ్బతింటున్నాయని అన్నారు. దేశీయ చేనేత వస్త్రాల ఉత్పత్తి పెంపొందించేందుకు పద్మశాలి కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. చేనేత శ్రామిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ సంప్రదాయ వృత్తులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా ప్రముఖ సామాజిక కార్యకర్త, రాచెరువు పరిరక్షణ సమితి సభ్యులు, బోడుప్పల్ పద్మశాలి సంఘం ముఖ్య సలహాదారు డా. లక్ష్మివీరమల్లు నేత మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా చేనేత మగ్గాలు మూగబోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ మగ్గాల విస్తరణ, కార్పొరేట్ వ్యవస్థల ప్రభావంతో సంప్రదాయ చేనేత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కృత్రిమ వస్త్రాల వినియోగం పెరగడంతో చిన్నారుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత వస్త్రాలకు సరైన ఆదరణ లేకపోవడం, తయారైన వస్త్రాలకు మార్కెట్ లేకపోవడం వల్ల సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్, నల్గొండ ప్రాంతాల్లో అనేక మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు బాధాకరమన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ చేనేత వృత్తిని పరిరక్షిస్తూ పద్మశాలి కుటుంబాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీనికి స్పందించిన చైర్మన్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తో చర్చించి పద్మశాలి కుటుంబాల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
