బిఆర్ఎస్ హాయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి…
బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది
– కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో ఫెయిల్
– ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి
– మావోయిస్టులతో చర్చలు జరపాలి
– మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఎల్కతుర్తి:
కాంగ్రెస్ ప్రభుత్వ అన్నిరంగాల్లో విఫలం అయ్యిందని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభలో రేవంత్ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్. మంచినీళ్లు ఇవ్వడంలో ఫెయిల్. సాగుకు నీరివ్వడంలో ఫెయిల్. కరెంటు సరఫరాలో ఫెయిల్. రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఫెయిల్. ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్. పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్. భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయ్యారు? ఎటుపడితే అటు ఒర్రుడు.. దేవుండ్లపై ఒట్లుపెట్టుడు.. అబద్ధపు వాగ్ధానాలు చేసుడు.. 20-30శాతం కమీషన్లు తీసుకునుడు.. సంచులు నింపుడు.. సంచులు మోసుడు అంతేనా? ఈ మాట కరెక్టేనా? అన్నింట్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా? అంటే.. ఫెయిల్ అంటూ జనాలు నినదించారు. 20-30శాతం కమీషన్ల మాట నేను అంటలేను. ఎవరు అన్నరు.. స్వయంగా ఆర్థికశాఖ మంత్రి చాంబర్‌కు వెళ్లి 200 మంది కాంట్రాక్టర్లు పోయి లొల్లిపెట్టి.. మమ్మల్ని 20-30శాతం కమీషన్లు అడుగుతున్నరు.. ఇదేం అన్యాయం అని చెప్పి అడిగిన మాటనే నేను చెబుతున్న’నన్నారు.
పోడగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి..
‘మాజీ సర్పంచులు పని చేశాం బిల్లులు ఇవ్వమంటే వాళ్లను గోసపుచ్చుకుంటున్నరు. వాళ్లేం పాపం చేశారు? ఘోరం ఈ అందానికి ఏం మాట్లాడుతరు.. కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటున్నరు. దేనికి రావాలి మీ ముచ్చట్లు వినడానికా? పిల్లలు అడిగితే మీరు జవాబు చెప్తలేరు. ఉన్నది ఉన్నట్లు నిలబెడితే ఆ ఆర్థికమంత్రి అసెంబ్లీలో నిలబడి.. భుజాలు తడుముకుంటున్నడు. నీకెందుకయ్యా బాధా? నువ్వు తీసుకుంటెనే నీకు బాధ ఉండాలి కదా? లేచి పెద్ద లొల్లి పెడుతున్నడు అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా, అవివేకంతో, అజ్ఞానంతో అడ్డగోలు మాటలు చెప్పారు. దాంతో మనం కూడ గోల్‌మాల్ అయిపోయాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే.. వాగు గుళ్లే.. మనం సల్లే.. ఇవాళ ప్రజలను ఆ గతికి తీసుకువచ్చారు. మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు. గాడిదలకు గడ్డేసి.. బర్లకు పాలు పిండితే వస్తయా? మరి ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నడు హైదరాబాద్‌లో ఆయన ఇళ్లు కూలగొడితే.. కేసీఆర్ అన్న యాడున్నవ్ నువ్వు రావాలి.. కత్తి వాడితో చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమనవడితివి అంతేనా? దీన్ని కూడా ప్రజలు విచారించాలి. మీకు అర్థం కావాలనే ఇది చెబుతున్న. పోడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్‌ఎస్ ఉంటది.. కేసీఆర్ ఉంటడు. వందశాతం మళ్లీ తెలంగాణలో విజయం సాధించాలి.. గులాబీ జెండా ఎగురవేయాలి.. అద్భుతమైన తెలంగాణను సాధించాలి’ అని పిలుపునిచ్చారు కేసీఆర్.
తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్…
కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని కేసీఆర్ మండిపడ్డారు. మొగోడు అని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట.. అని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. చాలా సిపాయిలం.. మా అంతా సియిపాలు లేరంటే నమ్మి బోల్తా పడ్డాం.. గల్లంతు అయ్యాం.. ఒక ఊరిలో నాట్లు వేసే టైమ్ వస్తే వడ్లు అలులకుతున్నడు ఓ రైతు. మొలకకు అలుకుడు చేస్తం కదా.. తుకాలు పోయమా..? పెద్ద మొగోడు అని ఒకర్ని పిలిచిండ్రట. మొగోడు అని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డట. ఇక మా అంత సిపాయిలు లేరు.. మేం తెచ్చే ఇస్తాం.. ఆరు చందమామలు.. ఏడు సూర్యుళ్లు పెడుతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి, మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారు. ఈ మాట వాస్తవం. ఇవాళ మమ్మల్ని నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదని మాట్లాడుతుండ్రు. ఎక్కడికెళ్లి తెచ్చి చేయాలని అంటున్నరు. అపారమైన అనుభవం ఉందని అప్పుడు అన్నరు.. ఇప్పుడేమో ఎల్లెలకల పడుతుండ్రు. నా ప్రసంగం టీవీల్లో వినే కోట్లాను కోట్ల మందికి విన్నవిస్తున్నా.. ఇంత మోసం ఉంటదా.. ఇంత దగా ఉంటదా.. ఎంత వరకు ఇది కరెక్ట్.. తెలంగాణను ఇప్పుడు బొందల పడగొట్టిండ్రు.. ఎంత ఘోరమైన ఫలితం చూస్తున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే…
ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ నాటి కాంగ్రెస్, టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు తప్పా.. ఏనాడు నోరెతెరిచి కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవారు బీఆర్‌ఎస్ బిడ్డలు అని గర్వంగా చెబుతున్నా. కానీ, పదవుల కోసం తెలంగాణను ఆగం చేసినవారు ఆనాడు ఉన్న కాంగ్రెస్ నాయకులు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి.. ఎంత ఘోరమంటే.. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే మన శాసనసభలో తెలంగాణ పదాన్నే నిషేధించాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించాడు. ఇదే జిల్లాకు చెందిన ప్రయణ్ భాస్కర్ ఆ రోజు ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే.. అది నేరమైనట్లుగా పరిగణించి తెలంగాణ పదాన్నే నిషేధించే ప్రయత్నించారు. మీ అందరికీ చరిత్ర తెలుసు’నన్నారు. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు.. ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వారే కాంగ్రెస్ పార్టీ, జవహర్‌లాల్ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరా గాంధీ ప్రభుత్వం. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. 2001 నుంచి విజృంభిస్తే.. నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి.. మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తుపెట్టుకొని తెలంగాణ ఇస్తమని నమ్మబలికి మీరు చూశారు. మళ్లీ ఎగొట్టే ప్రయత్నం చేశారు. 14 సంవత్సరాలు ఏడిపించారు. అది మీ అందరికీ తెలుసు. వాళ్లు ఎట్లెట్ల చేస్తుంటే.. వారి మోసాన్ని కప్పేయడానికి నేను.. జయశంకర్ సార్‌తో కలిసి పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ గొంతుపట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్లీ ప్రకటన వెనక్కి తీసుకొని.. మళ్లీ వెనక్కి వెళ్లారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావొచ్చు. సాగర హారాలు కావొచ్చు. వంటావార్పులు కావొచ్చు.. అనేక రూపాల్లో విజృంభించి భీకరమైన పోరాటం చేశాం’ అంటూ గుర్తు చేశారు.
తెలంగాణ అంటే ఎగతాళి చేబడ్డ ప్రాంతం..
‘మూడేళ్ల తర్వాత రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు మళ్లీ తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. వారికి ఇష్టం లేకపోయిన తెలంగాణ సృష్టించిన సుడిగాడుపులు తట్టుకలేమని తెలంగాణ ఇచ్చిన విషయం మీకు తెలుసు. తదనంతరం. ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. మనం అధికారం అనుభవించేందుకు తీసుకోలేదు. బాధ్యతగా తీసుకున్నాం. రాష్ట్రాన్ని మన చేతులో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడికి తీసుకొని పోయాం. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది. ఎన్ని రంగాల్లో ఎన్ని అవార్డులు వచ్చాయి. ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపించాం. తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఎగతాళి చేబడ్డ ప్రాంతం. పలికిమాలిన ప్రాంతం అని పేరుపెట్టబడిన ప్రాంతం. కానీ, ఎన్నిరంగాలు తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచాం. రూ.90వేలు ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.3.50లక్షలకు పెంచుకున్నాం. జీఎస్‌డీపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాం. తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నాం’ అని వెల్లడించారు.
బిఆర్ఎస్ ఆ సమయంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి…
పదేండ్లలో తెలంగాణను దగదగలాడే విధంగా, అందరూ ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహరం చేసి అయోధ్యకు తిరిగి రావాలనే ఆలోచనలో ఉన్నప్పుడు రాములవారి సోదరుడు లక్ష్మణుడు సహా చాలా మంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది.. అద్భుతంగా ఉంది.. ఇంక మనం అయోధ్యకు ఎందుకు ఇక్కడ్నుంచే పరిపాలన చేద్దాం అంటారు.. దానికి శ్రీరామచంద్రుడు ఒప్పుకోరు.. కన్నతల్లిని, జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు. కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి తిరిగి వచ్చారు అని కేసీఆర్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో, చాలా గందరగోళ పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి.. ఆత్మహత్యలకు అలవాలమైన, వలసలకు నిలయమైనటువంటి.. వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్నటువంటి తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని, జననీని, జన్మభూమిని మించింది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. 25 ఏండ్ల క్రితం ఎగిరిన జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది అవమానపరిచారు. ఎన్నో మాటలు అన్నారు. ఎగతాళి, అవహేళన చేశారు. మఖలో పుట్టింది పుబ్బలో పోతదని అన్నారు. కానీ అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది బలిదానాలతోని, అనేక ఉద్యమాలతోని యావత్ తెలంగాణ అద్భుతమైన ఉద్యమమై ఎగిసిపడింది. ఒక సమయంలో తెలంగాణ యావత్ ఒక పక్కన నిల్చుని బరిగీసి నా తెలంగాణ అక్కడ పెట్టు అని నిలబడ్డ సందర్భం సృష్టించాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజలు దీవిస్తే అద్భుతమైన పదేండ్ల పాటు దగదగాలాడే తెలంగాణను తయారు చేసి, అందరూ బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణను నిర్మాణం చేసుకున్నాం. 25 ఏండ్ల సుధీర్ఘ చరిత్రను ఇవాళ రజతోత్సవ సందర్భంగా వరంగల్‌లో జరుపుకుంటున్నాం. ఇప్పుడు కూడా కొందరు అడ్డుకుంటున్నారు. ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది. రాణి రుద్రమ ఏలిన వీరడగ్డ. సమ్మక సారక్కల పోరగుడ్డ, బమ్మెర పోతన కవిత మాధుర్యం పండించిన జీవగడ్డ.. ఈ వరంగల్ నేలకు వందనం చేస్తున్నా. మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆపరేషన్ కగార్ ఆపేయాలి…
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత కోసం చేపడుతున్న ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలు ఉన్నాయని చంపుకుంటా పోవడం పరిష్కారం కాదని, మావోయిస్టులు కూడా మానవత్వం ఉన్న మనుషులేనని వారితో మంచి వాతావరణంలో చర్చలు జరపాలని కోరారు. కగార్ ఆపరేషన్ ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపానున్నట్లు స్పష్టం చేశారు.
