మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారు

0

గ్లోబల్ ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
. అబద్ధాలు ప్రచారం చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పీహెచ్డీ ఇవ్వొచ్చు
. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారు
. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
హుజురాబాద్:
సీఎం రేవంత్ రెడ్డి పట్టపగలే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఆదివారం హుజురాబాద్ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా రోజుల తర్వాత హుజూరాబాద్ జర్నలిస్టులతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి అబద్ధాలు ప్రచారం చేయడంలో డబుల్ పిహెచ్ డి ఇవ్వొచ్చన్నారు. కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో మోసం చేశారని, మహారాష్ట్రలోనూ గ్యారెంటీ పేరుతో మోసం చేయబోయి బొక్క బోర్ల పడ్డారన్నారు. మహారాష్ట్రకు వెళ్లి మహిళలకు మూడు వేలు, రైతులకు రుణమాఫీ చేస్తామన్నా ప్రజలు విశ్వసించలేదన్నారు. సిఎం, మంత్రులు వెళ్లి ప్రచారం చేసారని, వీరిని చూస్తే తెలంగాణలో చేసిన మోసం గుర్తించి అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణలో మహిళలకు రూ.2500, ఫించన్, భరోసా బోనస్, తులం బంగారం ఇవ్వలేదన్నారు. అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఇప్పటికైనా రేవంత్, కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. వంద రోజుల్లో చేస్తామన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

దళిత బంధు డబ్బులు ఇవ్వడంలో జాప్యమెందుకు…
హుజురాబాద్ లో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారన్నారు. మొదటి విడుదల మంజూరైన లబ్ధిదారులకు రావాల్సిన రెండో విడత డబ్బులు ఇవ్వాలని అడిగితే స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద అరాచకానికి పాల్పడ్డారన్నారు. కొత్త పథకాలు దేవుడెరుగు…మేము ఇచ్చినవి ఇవ్వడం లేదన్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క దళితులకు చేసే మేలు ఇదేనా అనే ప్రశ్నించారు. ఇప్పటికే విడుదలైన దళిత బంధు పథకం డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫార్మాసిటీ పై మాట మార్చిన సీఎం…
జూలై 19 నాడు ఫార్మా సిటీ అని గజిట్ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటున్నాడని మండిపడ్డారు. ముందు ఇచ్చిన గజిట్ వాపస్ చేసుకోవాలని హితవు పలికారు. ప్రజల దగ్గరికి వెళ్లి మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. పచ్చటి పొలాలను తొండలు గుడ్లు పెట్టే జాగ అనడం తప్పు పట్టారు. కాళేశ్వరం కూలీ పోతే 20 టీఎంసీ నీళ్లను ఎట్లా తీసుకు పోతా అంటున్నారో చెప్పాలన్నారు. అదే కాళేశ్వరం భాగమైన కొండపోచమ్మ, మల్లన్న సాగర్ల నుండి హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల తాగునీటిని మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇవ్వాలని ఎలా ప్రణాళిక చేస్తున్నారని అడిగారు. ప్రాజెక్టులు విఫలమయ్యాయన్న మాటలు అబద్ధమని, కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు మేలు చేశాయని స్పష్టం అయిందన్నారు. ఒకవైపు కాళేశ్వరం నీళ్లతో మూసీ పునరుజ్జీవం చేస్తామని చెబుతున్నారు. మళ్లీ ఇవే నీళ్లను హైదరాబాద్ తాగునీటి వసతి కోసం ఉపయోగిస్తామని ప్రకటిస్తున్నారు. ఇందులో ఏది నిజం? మీరు చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోవడం నిజమా? దాని ద్వారా అందిన ప్రతిఫలం నిజమా? గత ప్రభుత్వాల ఘనతను మెచ్చుకొని మెడలో వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అసలు ఏ ఘనత లేదని చెప్పుకోవడమే దుర్మార్గం అన్నారు.

తెలంగాణను ధాన్యగారంగా చేసింది కేసీఆరే…
కోటి 61 లక్షల మెట్రిక్ టన్నుల పంట మా గొప్పతనం అంటున్న రేవంత్ రెడ్డి…2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే, టిఆర్ఎస్ ప్రభుత్వం 141 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచి ధాన్యగారంగా చేసింది కేసీఆరే అన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, రైతుబంధు, రైతు రుణమాఫీ, వ్యవసాయ పనిముట్లు అందించడం, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు, చెరువులను రిజర్వాయర్లతో అనుసంధానం చేయడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారు. అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారని, తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందన్నారు. వరంగల్ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదన్నారు. నేడు మార్కెట్ లో వడ్లు కొనే పరిస్థితి లేదన్నారు. రూ.7500 మద్దతు ధర ఉంటే పత్తి రైతులకు కేవలం రూ.6500 లభించిందన్నారు. రూ.1600, రూ.1700కే వరి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. మాటలు, మూటలు కట్టుడు బంద్ చేసి, గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. అక్రమ అరెస్టులు, కేసులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళిత బంధు డబ్బులు ఇవ్వాలని, అసెంబ్లీలో దళితుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సూడా మాజీ చైర్మన్ జివి రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

హరీష్ రావు ఘన స్వాగతం…

మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *