మున్సిపల్ జనరల్ బాడీలో అభివృద్ధిపై రగడ..
మున్సిపల్ జనరల్ బాడీలో అభివృద్ధిపై రగడ..
– చైర్‌పర్సన్, అధికారుల తీరుపై సొంత పార్టీ కౌన్సిలర్లే ధ్వజం
– వైస్ చైర్‌పర్సన్ సహా పలువురు కౌన్సిలర్ల సమావేశం బహిష్కరణ
– ఆరు నెలలుగా వార్డుల్లో అభివృద్ధి శూన్యం.. కౌన్సిలర్ల ఆగ్రహం
హుజూరాబాద్:
హుజూరాబాద్ మున్సిపాలిటీలో అధికార పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. అభివృద్ధి పనుల విషయంలో చైర్‌పర్సన్, మున్సిపల్ అధికారుల తీరుపై సొంత పార్టీకి చెందిన వైస్ చైర్‌పర్సన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై చైర్‌పర్సన్, అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు సమావేశం మధ్యలోనే బయటకు వచ్చి నిరసన తెలిపారు. అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కూడా సమావేశాన్ని బహిష్కరించడం మున్సిపల్ పాలకవర్గంలో నెలకొన్న అసంతృప్తికి అద్దం పట్టింది. మంగళవారం నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే అభివృద్ధి పనులపై కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించారు. తమ తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదని, కనీసం పారిశుధ్య సమస్యలపైనా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని పదేపదే కోరుతున్నా పట్టించుకోకపోవడంతో ఇక సభలో కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదంటూ పలువురు కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. అధికార పార్టీ వైస్ చైర్‌పర్సన్ గూడూరి అంజలితో పాటు కౌన్సిలర్లు మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, నాంపల్లి శ్రీనివాస్, వడ్లూరి శ్రీలేఖ, కోయల్‌కార్ భారతి, బండ వెన్నెల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డుల్లో కనీస పారిశుధ్య పనులు కూడా సక్రమంగా జరగడం లేదని, ప్రజలు తమను నిలదీస్తున్నా అధికారుల నుంచి స్పందన కరువైందని మండిపడ్డారు.
అభివృద్ధి శూన్యం.. కమీషన్ల కోసమే పనులా?
బీజేపీ కౌన్సిలర్లు పంజాల మనోజ్, దామెర అనూష, కొలుగూరి సుమలత, లక్ష్మీదుర్గ, కొండ ప్రశాంతిలు కూడా సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. మున్సిపాలిటీలో గత ఆరు నెలలుగా అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని వారు విమర్శించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా, అధికారులు చిన్నచిన్న పనులతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల పేరుతో నామమాత్రపు పనులు చేపడుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని, పనుల ఎంపికలో పారదర్శకత కొరవడిందని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు నాలుగు సర్వసభ్య సమావేశాలు జరిగినా, ఆయా సమావేశాల్లో తాము ప్రతిపాదించిన అభివృద్ధి పనుల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని మండిపడ్డారు. ఆరు నెలలుగా మా వార్డుల్లో తట్టెడు మట్టి కూడా పోయలేదు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి?” అంటూ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిలర్ల వార్డులనే కాకుండా సొంత పార్టీ కౌన్సిలర్ల వార్డుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కొన్ని వార్డులకు ఒకటి రెండు పనులు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తీర్మానాలు కాగితాలకే పరిమితమా?
బీఆర్‌ఎస్ కౌన్సిలర్ గందె శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత సమావేశాల్లో ఆమోదించిన పలు తీర్మానాలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై కౌన్సిలర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎజెండా రూపొందించడం సరికాదన్నారు. కౌన్సిలర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కమిషనర్, చైర్‌పర్సన్ ఏకపక్షంగా ఎజెండా రూపొందించి పంపించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. సమావేశంలో కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇవ్వకుండా దాటవేసే ధోరణి అవలంబించడం తగదన్నారు. పట్టణంలో అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా పేరుకుపోతున్నాయని, అన్ని పార్టీల కౌన్సిలర్లను కలుపుకొని సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
అధికార పార్టీలో అసంతృప్తి!
హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గంలో అధికార పార్టీ అంతర్గత అసంతృప్తి తారస్థాయికి చేరినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష కౌన్సిలర్లు సమావేశాలను బహిష్కరించడం సర్వసాధారణమే అయినా.. అధికార పార్టీకి చెందిన వైస్ చైర్‌పర్సన్‌తో పాటు ఐదుగురు కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనుల విషయంలో చైర్‌పర్సన్ వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ కౌన్సిలర్లే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం అధికార పార్టీలో నెలకొన్న విభేదాలకు నిదర్శనంగా మారింది. కౌన్సిలర్లను కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన పాలకవర్గం ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ మధ్య మున్సిపల్ అభివృద్ధి పనుల విషయంలో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వైస్ చైర్‌పర్సన్ అంజలి స్వయంగా సమావేశాన్ని బహిష్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయన్న చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై పాలకవర్గంలోనే అసంతృప్తి రగులుతుండటంతో రానున్న రోజుల్లో మున్సిపల్ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశముంది. మొత్తంగా మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశం అభివృద్ధి కంటే అధికార పార్టీలోని అంతర్గత అసంతృప్తినే తెరపైకి తెచ్చింది.
