కూచిపూడి నృత్యంలో పల్లవి రెడ్డి ప్రతిభ
కూచిపూడి నృత్యంలో పల్లవి రెడ్డి ప్రతిభ
‘టాలెంట్ ఐకాన్ అవార్డు’కు ఎంపిక
హుజురాబాద్:
కూచిపూడి నృత్యరంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ చెల్పూర్ గ్రామానికి చెందిన గుజ్జ పల్లవి రెడ్డి (నవీన్ రెడ్డి సతీమణి) ‘బెస్ట్ క్లాసికల్ డ్యాన్సర్–టాలెంట్ ఐకాన్ అవార్డు’కు ఎంపికయ్యారు. గత పదేళ్లుగా కూచిపూడి నృత్య కళాకారిణిగా, నృత్య ఉపాధ్యాయురాలిగా ఆమె విశేష సేవలందిస్తున్నారు.
పల్లవి రెడ్డి ఇప్పటికే రెండుసార్లు గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడంతో పాటు కూచిపూడి నృత్యంలో నంది అవార్డును అందుకున్నారు. ఆల్ ఇండియా స్థాయి కూచిపూడి నృత్య పోటీల్లో మూడో స్థానం సాధించడంతో పాటు ‘నాట్య మయూరి అవార్డు’ను కూడా పొందారు. బీటెక్ విద్యను పూర్తిచేసిన ఆమె కూచిపూడి నృత్యంలోనూ అకాడమిక్ విద్యను అభ్యసించారు. అనంతరం ‘హయగ్రీవ నాట్య అకాడమీ’ని స్థాపించి విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ అందిస్తున్నారు. ముఖ్యంగా 30 మంది అనాథ పిల్లలకు ఉచితంగా నృత్య శిక్షణ ఇస్తూ కళతో పాటు సేవాభావాన్ని చాటుతున్నారు. పల్లవి రెడ్డి ప్రతిభ, కళాసేవను గుర్తించి టాలెంట్ ఐకాన్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె మరిన్ని విజయాలు సాధించి కూచిపూడి కళకు మరింత ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు.
