జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
– జర్నలిస్టులకు అండగా టీడబ్ల్యూజేఎఫ్
– అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలి
– టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు కుడుతాడి బాపురావు
– వేములవాడలో విస్తృతంగా సభ్యత్వ నమోదు
వేములవాడ:
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు కుడుతాడి బాపురావు డిమాండ్ చేశారు. మంగళవారం వేములవాడ పట్టణ కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన బాపురావు మాట్లాడుతూ… జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని, అనేక ఓడిదుడుకుల మధ్య వృత్తిబాధ్యతలు నిర్వహిస్తున్నారని, చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగుల మాదిరిగా అమలుచేయాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందని, ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసిందని, వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పేరుక రవి మాట్లాడుతూ… రాష్ట్రంలో జర్నలిస్టులకు అండగా నిలిచే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మాత్రమే అని అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ పదవుల కోసం, అక్రమ సంపాదన కోసం పాకులాడే సంఘాల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని సంఘాలు జర్నలిస్టుల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నాయని ధ్వజమెత్తారు. వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొప్పుల ప్రసాద్ మాట్లాడుతూ టీడబ్ల్యూజేఎఫ్ ప్రజాస్వామ్యబద్దంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడే యూనియన్ అని అన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో జర్నలిస్టులకు అండగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన జిల్లా నాయకత్వాన్ని కోరారు. అనంతరం కొత్త సభ్యులకు ఫెడరేషన్ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పెరుక రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండి యూసుఫ్, వేములవాడ అధ్యక్షుడు కొప్పుల ప్రసాద్, కార్యదర్శి అవదూత శ్రీధర్, కోశాధికారి నరేందర్, మాజీ అధ్యక్షుడు తొగరు కరుణాకర్ జర్నలిస్టులు, జువ్వజి ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ కవ్వాల సురేందర్, ప్రధాన కార్యదర్శి అవధూత శ్రీధర్, క్యాషియర్ సుంకరి నరేందర్, ఎండి షబీర్, చందు, రఫిక్, వెంకటస్వామి, సిద్ధంశెట్టి వేణు, కోటగిరి శేఖర్, సిర్రం ప్రసాద్, ఎండి షరీఫ్, వెంకట మల్లు, తోట శేఖర్, తదితరులు పాల్గొన్నారు
