ప్రమాద బాధితులకు హుజురాబాద్ పోలీసుల చేయూత..
ప్రమాద బాధితులకు పోలీసుల చేయూత…
. ఏసిపి శ్రీనివాస్ జీ చేతుల మీదుగా రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేత
హుజురాబాద్:
హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా పాపారావు బొందలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు హుజురాబాద్ పోలీసులు అండగా నిలిచారు. హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ మంగళవారం సాయంత్రం తన కార్యాలయం వద్ద 10 మంది అగ్ని ప్రమాద బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి తక్షణ సహాయంగా రూ. 3000 చొప్పున 30,000 నగదును అందజేశారు. అగ్ని ప్రమాదంతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఈ సంఘటన అత్యంత బాధాకరమని, తమ వంతుగా వారికి ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై సమీపంలోని సీసీ కెమెరాలు ఆధారంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామన్నారు. విద్యుత్ ఘాతం అయితే ప్రభుత్వపరంగా ఆదుకునేలా సహకరిస్తామని, ఏదైనా కావాలని చేసినట్లయితే ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని ఎసిపి శ్రీనివాస్ జి హెచ్చరించారు. బాధితులు మనోవేదనకు గురికాకుండా, ఆర్థికంగా కృంగిపోకుండా ఉండేందుకే సబ్ డివిజన్ పోలీసుల సహకారంతో బాధితులకు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని ఎసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట టౌన్ సిఐలు బొల్లం రమేష్, వి రవి, సబ్ డివిజన్లోని ఎస్ఐలు, అగ్నిప్రమాద బాధితులు పాల్గొన్నారు.
