ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు
రైతు వారంతో రైతులకు సమగ్ర అవగాహన..
– ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు
– హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు జి. సునీత
హుజురాబాద్:
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక, రైతు వారము” (మే 4 నుంచి మే 9, 2026 వరకు) కార్యక్రమం రైతులకు ఒక సమగ్ర మార్గదర్శకంగా నిలుస్తుందని హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు జి. సునీత పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రభ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రశ్న: రైతు వారము నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
ఏడిఏ: రైతుల ఆదాయాన్ని పెంచడం, ఖర్చులను తగ్గించడం, పంటల ఉత్పాదకతను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ప్రతి రోజూ ఒక ప్రత్యేక అంశంపై అవగాహన కల్పిస్తూ, గ్రామ స్థాయిలో రైతులతో ప్రత్యక్షంగా చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారాలు సూచిస్తాం.
ప్రశ్న: మొదటి రోజు ఏ అంశాలపై దృష్టి సారిస్తున్నారు?
ఏడిఏ: నేల ఆరోగ్య పరిరక్షణ చాలా కీలకం. సమతుల్య ఎరువుల వినియోగం, మట్టి పరీక్షల ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా భూమి సారాన్ని కాపాడుతూ మంచి దిగుబడులు సాధించవచ్చు.
ప్రశ్న: రెండో రోజు కార్యక్రమాల విశేషాలు ఏమిటి?
ఏడిఏ: ఉద్యాన పంటల సాగు విస్తరణపై దృష్టి పెడతాం. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ, రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తాం. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల ఎంపికపై మార్గదర్శకత్వం ఇస్తాం.
ప్రశ్న: రైతులకు రుణాలు, మార్కెటింగ్ అవకాశాలపై ఏం చేస్తారు?
ఏడిఏ: మూడో రోజు బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలపై అవగాహన కల్పిస్తాం. సహకార సంఘాలు, ఎఫ్పిఓల ద్వారా రైతులకు సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం. అలాగే, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై స్పష్టత ఇస్తాం.
ప్రశ్న: ఆధునిక వ్యవసాయంలో టెక్నాలజీ పాత్ర ఎలా ఉంది?
ఏడిఏ: నాల్గవ రోజు పిఎం కుసుమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్ వినియోగంపై రైతులకు ప్రదర్శనలు నిర్వహిస్తాం. టెక్నాలజీ ద్వారా ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచే మార్గాలను వివరిస్తాం.
ప్రశ్న: పశుసంవర్ధక, మత్స్యశాఖ అంశాలు రైతులకు ఎలా ఉపయోగపడతాయి?
ఏడిఏ: ఐదవ రోజు పశుసంవర్ధక శాఖ ద్వారా పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, వేసవిలో పశు సంరక్షణపై అవగాహన కల్పిస్తాం. అలాగే మత్స్యశాఖ ద్వారా చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నియంత్రణ, అధికోత్పత్తి సాధనపై సూచనలు ఇస్తాం.
ప్రశ్న: చివరి రోజు ప్రత్యేకత ఏమిటి?
ఏడిఏ: వినియోగదారులు కోరుకునే సన్న వరి రకాల సాగుపై దృష్టి పెడతాం. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైతులు పంటలు పండిస్తే వారికి మంచి లాభాలు వస్తాయి.
ప్రశ్న: రైతులకు మీ సందేశం ఏమిటి?
ఏడిఏ: రైతు వారంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శాస్త్రీయ పద్ధతులను అనుసరించి, ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తే వ్యవసాయం లాభదాయకంగా మారుతుంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరుతున్నాను. హుజురాబాద్‌లో నిర్వహించనున్న రైతు వారము కార్యక్రమం రైతులకు కొత్త దారులు చూపించే వేదికగా నిలవనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి మూలం అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
