గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు…

0

గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు…
– జిల్లాలో 56 పరీక్ష కేంద్రాల 
– హాజరుకానున్న 26 వేలా 415 మంది అభ్యర్థులు
– జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
జిల్లాలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ -3 పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శనివారం పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, రూట్ అధికారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా పరీక్షను నిర్వహించాలని అన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమాచారం, సహాయం కావాలన్నా వెంటనే ప్రాంతీయ కో-ఆర్డినేటర్ల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు, శాఖాధికారులు, రూట్ అధికారులు, రీజనల్ కోఆర్డినేటర్ లతో సమన్వయంతో ఉండాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోని ప్రతి హాల్ లో 24 మంది అభ్యర్థులకు సీటింగ్ అరేంజ్మెంట్, నిబంధనల మేరకు చేయాలన్నారు. కిటికీలు, కాంపౌండ్ వాల్ ల వద్ద ఎటువంటి తప్పులు జరగకుండా భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. కిటికీల వద్ద, పరీక్షా హాళ్లలో ఉన్న చెత్త, స్టడీ మెటీరియల్, పోస్టర్లు పూర్తిస్థాయిలో తొలగించాలన్నారు. పరీక్షా కేంద్రానికి కేటాయించిన అభ్యర్థుల సంఖ్య మేరకు కావాల్సిన ప్రిస్కింగ్ సిబ్బందినీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. మహిళా అభ్యర్థులను చెక్ చేసేందుకు మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. గది నెంబర్, త్రాగునీరు, టాయిలెట్లు, పరీక్ష హాల్స్ ఎక్కడ ఉన్నాయో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నవంబర్ 17 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5-30 వరకు రెండు సెషన్లు, నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 వరకు గ్రూప్-3 పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 26 వేలా 415 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 56 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్ లో 8-30 నుంచి, మధ్యాహ్నం సెషన్ లో 1-30 నుంచి అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల గేటు ఉదయం 9-30 గంటలకు, మధ్యాహ్నం 2-30 గంటలకు మూసి వేస్తామని, దీని తర్వాత పరీక్షా కేంద్రంలోకి ఎవ్వరిని అనుమతించడం జరగదన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తమ వెంట బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్నులు, ఫోటోతో కూడిన హాల్ టికెట్, ప్రభుత్వంచే జారీ చేసిన ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ తీసుకుని రావాలన్నారు. హాల్ టికెట్ లో ఫోటో సరిగ్గా లేకపోతే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గెజిటెడ్ అధికారి లేదా చివర చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపల్ సంతకంతో తీసుకువచ్చి పరీక్షా హాల్లో ఇన్విజిలేటర్ కు అప్పగించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు క్యాలిక్యులేటర్, పేజర్స్, సెల్ఫోన్, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైజెస్, వాచ్, మాథమేటికల్ టేబుల్, లాగ్ టేబుల్, హ్యాండ్ బ్యాగ్స్, జోలాస్, పౌచెస్, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్, చార్ట్స్, లూజ్ షీట్స్, జువెలరీ (మంగళసూత్రం, గాజులు సంబంధ ఐటెంలు మినహాయించి), ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మొదలగు సామాగ్రి తీసుకురావద్దన్నారు. చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని, షూస్ వేసుకోవద్దన్నారు. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ వ్యాలీడ్ కాదని, బయోమెట్రిక్ విధానం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు మెహందీ, టాటూ వంటివి పెట్టుకోవద్దన్నారు. ప్రతి పేపర్ సమయంలో అభ్యర్థి ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్ టికెట్ పై సంతకం పెట్టాలన్నారు. ఓఎంఆర్ షీట్ ను సరిగా చెక్ చేసుకోవాలని, పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ విడిచి వెళ్ళుటకు వీలులేదన్నారు. నిబంధనలు పాటిస్తూ, సజావుగా పరీక్షల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *