పర్యావరణ భవిష్యత్తుపై ముంచుకొస్తున్న ముప్పు.

0

అడవుల పరిరక్షణ – అటవీశాఖపై దాడులు: పర్యావరణ భవిష్యత్తుపై ముంచుకొస్తున్న ముప్పు.

“అటవీశాఖపై దాడులు ఖండిస్తూ – ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మరియు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ల వైఖర్ల పై ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ మరియు హరిత స్వచ్చంద సంస్థల తీవ్ర స్పందన”

అటవీ శాఖ అధికారుల పట్ల ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రదర్శిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నాం. రేయింబవళ్లు ప్రాణాలకు తెగించి అడవులను, వన్యప్రాణులను సంరక్షిస్తున్న అటవీ సిబ్బందిపై నడిరోడ్డుపై దౌర్జన్యం ప్రదర్శించడం అత్యంత దురదృష్టకరం. ప్రస్తుత ప్రభుత్వ శాసనసభ్యుడిగా, వైల్డ్‌లైఫ్ బోర్డు సభ్యుడిగా, చట్టంపై అవగాహన కలిగిన వ్యక్తిగా ఉండి కూడా హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. విధుల్లో ఉన్న సిబ్బందికి కనీస వసతులు కూడా నిరాకరిస్తూ “జంగిల్‌లోనే పడుకోవాలి” అనే హెచ్చరికలు జారీ చేయడం మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి. ఇక ఈకో-సెన్సిటివ్ జోన్‌లలో అక్రమ నిర్మాణాలు, ఇసుక స్మగ్లింగ్‌కు మద్దతు ఇవ్వడం చట్ట విరుద్ధం మాత్రమే కాకుండా ప్రకృతి సమతుల్యాన్ని భంగం చేసే చర్య. సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సింది పోయి, క్షేత్రస్థాయిలో పనిచేసే చిన్న ఉద్యోగులపై ఒత్తిడి తేవడం అన్యాయం. గ్రామీణ ప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బందిని అడ్డుకోవడం, జరిమానాలు విధిస్తామని బెదిరించడం రాజ్యాంగానికి విరుద్ధం. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి అధికారులను శత్రువులుగా చూపించడం సమాజంలో విభేదాలను పెంచుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ చట్టబద్ధ చర్యలు తీసుకోవడం, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని అధికారులకు రక్షణ కల్పించడం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం, అలాగే విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం.

ఇక సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ప్రదర్శిస్తున్న వ్యాఖ్యలు మరియు వైఖరి తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. అడవులను “మీ ఇష్టమొచ్చినట్టుగా చేసుకోండి”, “ఎవరు అడ్డం వచ్చినా మీకు ఏం చేయాలో తెలుసు కదా” అంటూ ప్రజలను రెచ్చగొట్టడం, ముఖ్యంగా అటవీశాఖ అధికారులను లక్ష్యంగా చేసుకుని “అధికారులు అడ్డం వస్తే ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసు” అని ప్రోత్సహించడం పూర్తిగా చట్టవిరుద్ధం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమైన చర్య. అంతేకాకుండా “పోలీసులు కూడా మీకు అడ్డం రారు” అని చెప్పడం ద్వారా ప్రజల్లో చట్టానికి భయం లేకుండా చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే ఇటువంటి ప్రేరేపణాత్మక వ్యాఖ్యలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని అశాంతికి దారి తీసే విధంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించదగినది. ఇటువంటి చర్యలు అటవీ సంపద నాశనానికి, అధికారులపై దాడులకు దారి తీసే ప్రమాదం ఉన్నందున వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉంది.

నిజానికి అడవులను కాపాడే బాధ్యత భారత రాజ్యాంగం ప్రకరణ 51 ఏ/(జి) ప్రకారం అందరి బాధ్యత. అయితే అటవీ శాఖ అడవులను వన్యప్రాణులను కాపాడటం ఒక డ్యూటీ మాత్రమే కాదు అడవులను కాపాడే ప్రత్యేక బాధ్యత తీసుకుంటుంది. కానీ అది నేడు వారికి శాపమై కూర్చుంది. దానికి కారణం మనము మరియు మనం ఎంచుకున్న పాలకులు. ఇది ఎందుకు అంటున్నామంటే ఇటీవల కొన్ని రిజర్వ్ ఫారెస్ట్ లో అంటే మన తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మరియు కవాల్ టైగర్ రిజర్వ్ ఈ రెండు టైగర్ రిజర్వులలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అటవీ శాఖ మీద దాడి, మరియు విచక్షణ రహితంగా అక్కడి ప్రజలు మరియు పాలకులు వారిని ఎన్నో ప్రయాసలకు గురి చేశారు. ఈమధ్య కొత్తగూడం ఫారెస్ట్ లోనే కావచ్చు, జన్నారం ఫారెస్ట్ లోనే కావచ్చు మరియు ఉడుంపూర్ ఫారెస్ట్ లోనే కావచ్చు ఒక అటవీ శాఖనే బాధ్యులను చేస్తూ సహాయ నిరాకరణ చేయాల్సిందిగా అక్కడి లోకల్ ఎమ్మెల్యేలు మరియు ప్రజా సంఘాలు వారిని ఎండగడుతున్నారు, అంటే అటవీ శాఖ వారు అడవిని కాపాడడం తప్పా? గతంలో ఓ ఏం.ఎల్.ఎ. సోదరుడు డ్యూటీ నిర్వహిస్తు అక్రమాలను అడ్డుకున్న ఒక లేడీ అటవీ అధికారిణిని దౌర్జన్యంగా కొట్టి బెదిరించడం, డ్యూటీచేస్తున్న అటవీ క్షేత్ర అధికారిని వేటకొడవళ్ళతో నరికి హత్యచేసి చంపడం, ఓ అటవీ సెక్షన్ అధికారి ని హత్యప్రయతంగా కొట్టడం మొదలగు సంఘటనలు అటవీ అధికారుల పై రక్షణ లోపం అద్దం పడుతున్నాయి. అటవీ అధికారులు వారి డ్యూటీని సక్రమంగా చేస్తున్నారు కానీ కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం మౌకికంగా పరోక్షంగా అటవీ అధికారులపై అక్కడి ప్రజలను అటవీ శాఖపై ఉసిగొల్పి వారిపై దాడి చేసే క్రమంగా రెచ్చగొడుతున్నారు. ఒక అక్రమ ఇసుక రవాణా, అక్రమ కలప రవాణా, అక్రమంగా జంతువులను వేటాడి చంపటం ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగే నేరాలు. వీటిని అరికట్టడానికి ప్రజలు, ప్రజా సంఘాలు, లోకల్ నాయకులు, పాలకులు అందరూ సహకరించాలి. ఎందుకంటే అడవులు లేకుంటే జీవనం లేదు మన ముందు తరాలకు మనం ఏమిస్తాం..? ఆలోచించే అవసరం ఎంతైనా ఇప్పుడు ఉన్నది.

ఎక్కడో ఒక చిన్న సంఘటన ఫారెస్ట్ వారు లోకల్ ట్రైబ్స్ మీద అటాక్ చేశారని అదే అదనుగా మిగతా ఫారెస్ట్ సిబ్బందిని, అటవీ శాఖను కూడా ఇబ్బందికి గురి చేయడం మరియు వారికి ఆ గ్రామాల్లో సహాయ నిరాకరణ చేయటం అనేది ఎంతవరకు సమంజసం? మనం ఏమన్నా బ్రిటిష్ కాలంలో ఉన్నామా లేక అటవీ శాఖ వారు బ్రిటిష్ వాళ్ళా..? మనమేమైనా స్వాతంత్రోద్యమం చేస్తున్నామా? వారిపై తిరుగుబాటు చేయడానికి, వారు చేసే డ్యూటీకి మనం అడ్డుపడటం రాజ్యాంగ విరుద్ధం మరియు చట్ట విరుద్ధం, ఇది చెప్పాల్సింది పోయి అక్కడి పాలకులు ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రజల అండతో అటవీ శాఖను దూషించడం, బహిర్గతంగా, మీడియా పరంగా బెదిరించడం, వారు గ్రామాల్లోకి వస్తే వారిపై దాడి చేయమని చెప్పడం ఒక పబ్లిక్ మీటింగ్లో మరియు కలెక్టర్, ఎస్పీ ల సమక్షంలో మరియు మీడియా సాక్షిగా ప్రచారం చేయడం జరిగింది.

ఇదంతా చూస్తుంటే మనం ఏ కాలంలో ఉన్నాము అనేది మనకు మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. పాలించే ప్రభుత్వంలో ఉండి, డ్యూటీ చేస్తున్న అధికారుల విధులకు ఆటంక పరుస్తూ బెదిరించడం, జిల్లా పాలక యంత్రాంగం అయినా జిల్లా అటవీ అధికారుల, జిల్లా కలెక్టర్ల మరియు జిల్లా పోలీసు అధికారులముందే అటవీ అధికారులను బెదిరించే సంఘటనలను ఏమని తీసుకోవాలో ఆలోచిఅంచుకోవాల్సిన అవసర తరుణం ఇది. ఈ వార్నింగ్ ఒక రకంగా దౌర్జన్యం. ఇదే సహాయ నిరాకరణ అటవీ శాఖ వారు కూడా చేయాలని తలిస్తే ఈ అడవులు ఏమవుతాయి అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. దీనికి కారణం ప్రజలకు అటవీపట్ల అవగాహన లేకపోవడం దానికి సంబంధించిన పాలకులు వారికి సరిగా నచ్చజెప్పకపోవడం పైగా పోడును ప్రోత్సహించడం వాటిని అడ్డుకోవడానికి వెళ్లిన అటవీ శాఖను అందులో మహిళా సిబ్బందిని కూడా లెక్కచేయకుండా వారిపై విచక్షణారహితంగా కారం జల్లడం, కర్రలతోటి కొట్టడం, దూషించడం ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం. దురదృష్టమేంటంటే అక్కడి ఎమ్మెల్యేలు వైల్డ్ లైఫ్ బోర్డ్ మెంబర్స్ గా ఉండి కూడా అటవీ శాఖకు సహకరించాల్సింది పోయి వారిపై దాడి చేయడానికి ప్రజలను ఉసికొల్పటం మరియు రెచ్చగొట్టడం ఏమిటో… ఇది ప్రజాస్వామ్య దేశమా? లేకుంటే నిరంకుశ పాలన గల దేశమా? అర్థం కావడం లేదు. ఒక ఖాకి యూనిఫామ్ గల పోలీస్ శాఖకు, ఆర్మీకి ఉన్న ప్రాముఖ్యత మన అటవీశాఖ ఖాకీ యూనిఫామ్ కు మనము విలువ ఇవ్వట్లేదు.

ఎన్నో సంఘటనల్లో పోలీస్ శాఖ మరియు కలెక్టర్లు కూడా వారికి సహకరించలేదు పైగా ఇది మా డ్యూటీ కాదు మీకు మీరే పరిష్కరించుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చారు.
ఒక అటవీ దినం సందర్భంగా పర్యావరణ దినం సందర్భంగా టైగర్ డే సందర్భంగా మరియు ఎన్నో అటవీ కి సంబంధించిన పండుగలను చేసుకుంటాం. అందులో ఎన్నో మాట్లాడతాం మొక్కలు నాటాలి, అడవులు కాపాడాలి, జంతువులను కాపాడాలి అని ఎన్నో నినాదాలు చేస్తూ పాఠశాల సంబంధించిన పిల్లలను తీసుకువచ్చి వాళ్లకు ఎన్నో హామీలు ఇస్తూ, ఎన్నో సూక్తులు చెప్పుతూ కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ నిజానికి వస్తే ఇవేవీ వాస్తవంగా జరగట్లేదు. మన వాగ్దానాలు మరియు నినాదాలు అక్కడి కార్యక్రమం వరకే గాని క్షేత్రస్థాయిలో పూర్తిగా కార్యరూపం దాల్చటంలేదు.
ఇలాంటి దుష్పరిణామాలు పునరావృత్తం కాకుండా మనమందరం సంఘటితంగా ఉండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సహకరించాలి. ఎందుకంటే ప్రజల ఆస్తులైన అడవులను వన్యప్రాణులను, అడవులలో ఉన్న సహజ వనరులను నిత్యం కాపాడే అటవీ అధికారులను, క్షేత్ర స్థాయిలో ఉండే అటవీ నిఘా ఉద్యోగుల వరకు మనం అందరం వారిని అర్ధంచేసుకొని వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది. అడవిని మరియు వాటి చట్టాలను గౌరవించాలి. ఎలాగైతే రైల్వే కి సంబంధించిన వస్తువులను దొంగిలిస్తే జైలు పాలు అవుతామో అలాగే అటవీ సంపదను కూడా ఎవరైనా దొంగిలిస్తే జైలు పాలు కావాల్సిందే.

ఎన్నో చట్టాలు ఆర్టీసీ, పోలీస్, రైల్వే, డాక్టర్స్, హాస్పిటల్స్ పైన దాడిని ఖండిస్తూ ప్రత్యేకమైన చట్టం ఉంది కానీ అటవీశాఖ పై దాడిని ఖండిస్తూ చట్టం ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు పైగా వారిని ఇష్టమొచ్చినట్టు దూషించటం, దాడి చేయటం రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది. ఈ చట్టావిరుద్ద పోకడలపై గౌరవనీయులైన అటవీ, పర్యావరణ మంత్రివర్యులు కూడా సానుకూలంగా స్పందించి అడవిని, అటవీ శాఖను కాపాడుకునే ప్రయత్నం చేసి ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ సిబ్బందిపై జరుగుతున్న అన్యాయాలను అక్కడి ప్రజలతో, పాలకులతో మాట్లాడి సమస్యను చట్టపరమైన కోణం దృష్టిలో పెట్టుకొని పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాము. కాబట్టి అడవులను కాపాడే బాధ్యత ఒక అటవీ శాఖ అనే కాదు మన అందరి పౌరుల ప్రాథమిక బాధ్యత దానిని కాపాడుకొనే ప్రయత్నం చేద్దాం.

“అడవి ఉంటేనే సమాజం ఉంటుంది” అనే సత్యాన్ని గుర్తుంచుకుని అడవులను, వన్యప్రాణులను, పర్యావరణాన్ని కాపాడే అటవీశాఖకు పూర్తి మద్దతు ఇవ్వడం ప్రతి బాధ్యతగల పౌరుడి కర్తవ్యమని స్పష్టం చేస్తూ… “అటవీ, పర్యావరణాన్ని కాపాడే అధికారులను అవమానిస్తే సాహించేది లేదు!”

– ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సంస్థ,
వరంగల్, తెలంగాణ రాష్ట్రం మరియు హరిత స్వచ్చంద సంస్థలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *