అడవి పందుల వేటకు కరెంట్ ఉచ్చులు
అడవి పందుల వేటకు కరెంట్ ఉచ్చులు: తప్పిన పెను ప్రమాదం
– ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ చొరవతో రంగంలోకి విద్యుత్ శాఖ అధికారులు
– 2 కి.మీ మేర వైర్లు తొలగింపు.. నలుగురు నిందితుల గుర్తింపు
శాయంపేట: మండల పరిధిలోని తహరాపూర్–పోచారం గ్రామాల మధ్య గల గుట్టల అటవీ ప్రాంతంలో అడవి పందుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన ప్రమాదకర విద్యుత్ ఉచ్చులను అధికారులు తొలగించారు. ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ (OWLS) సమయోచిత చొరవతో మూగజీవాలతో పాటు అటుగా వెళ్లే ప్రజలకు ప్రాణాపాయం తప్పింది.
రాత్రి వేళల్లో విద్యుత్ చౌర్యం.. గుట్టల పరిసరాల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో కొందరు వేటగాళ్లు విద్యుత్ తీగలతో ఉచ్చులు బిగిస్తున్న విషయాన్ని ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ బృందం గుర్తించింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర కర్రలు పాతి, ‘J’ ఆకారపు వైర్లను అమర్చి, రాత్రి సమయాల్లో సమీప విద్యుత్ స్తంభాల నుంచి నేరుగా కనెక్షన్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఈ ఉచ్చుల వల్ల అడవి పందులు, ఇతర వన్యప్రాణులతో పాటు సమీప రైతులు, పశువుల కాపరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో సొసైటీ ప్రతినిధులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని పోలీస్, అటవీ శాఖలతో పాటు ఎన్పీడీసీఎల్ (NPDCL) సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు.
ఉచ్చులు తొలగించిన అధికారులు.. ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు శాయంపేట మండల ఏఈ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. గుట్టల చుట్టూ ప్రమాదకరంగా అమర్చిన విద్యుత్ ఉచ్చులు, తీగలను పూర్తిగా తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ దారుణానికి ఒడిగడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
కేసులు నమోదు చేస్తాం: ఏఈ వన్యప్రాణులను హతమార్చడంతో పాటు విద్యుత్ చౌర్యానికి పాల్పడిన నలుగురు నిందితులను గుర్తించామని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమాచారం అందించి ప్రమాదాన్ని నివారించిన ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీకి ధన్యవాదాలు తెలిపారు.
సమాచారం అందించాలి: ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ ఎక్కడైనా ఇలాంటి చట్టవిరుద్ధ వేట, ప్రమాదకర తీగల అమరిక కనిపిస్తే వెంటనే సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాలని ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని పేర్కొంది.
- పోలీసు కంట్రోల్ రూమ్: 100
- అటవీ శాఖ హెల్ప్‌లైన్: 1930
- విద్యుత్ శాఖ ఫిర్యాదులు: 1912
