కాకతీయ జూ పార్క్‌లో వైల్డ్‌లైఫ్ వీక్ సంబరాలు

0

కాకతీయ జూ పార్క్‌లో వైల్డ్‌లైఫ్ వీక్ సంబరాలు: విద్యార్థుల ప్రతిభాపాటవ పోటీలు
-హన్మకొండ:
జాతీయ వైల్డ్‌లైఫ్ వీక్ ఉత్సవాలను పురస్కరించుకుని అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ (ఓల్స్) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్‌లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి హాజరైన 36 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వన్యప్రాణుల రక్షణ, అటవీ ఆవాసాల ప్రాధాన్యత, ప్రకృతి సమతుల్యత మరియు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను వ్యాసాలు, చిత్రాల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇందారం నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను, పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పర్యావరణ సుస్థిరతపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు చూపిన ప్రతిభ, ఉత్సాహం భవిష్యత్ తరాలకు పర్యావరణ స్పృహను అందించేందుకు బలమైన పునాదిగా నిలుస్తుందని ప్రశంసించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జూ పార్క్ అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఔల్స్ వాలంటీర్లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *