మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం…
మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం…
– కార్పొరేషన్లో 62.98 శాతం పోలింగ్
– హుజూరాబాద్‌లో అత్యధికంగా 81.47 శాతం
– జమ్మికుంటలో 79.81 శాతం ఓటింగ్
– చొప్పదండి మున్సిపాలిటీలో 78.76 శాతం పోలింగ్
కరీంనగర్:
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 62.98 శాతం పోలింగ్..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,40,580 మంది ఓటర్లు ఉండగా, 2,14,486 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొత్తం పోలింగ్ శాతం 62.98గా నమోదైంది. కొన్ని డివిజన్లలో ఉదయం మందగించిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత వేగం పుంజుకుంది.
జమ్మికుంటలో 79.81 శాతం ఓటింగ్…
జమ్మికుంట మున్సిపాలిటీలోని 30 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు భారీగా పాల్గొన్నారు. మొత్తం 34,455 మంది ఓటర్లలో 27,498 మంది ఓటు వేశారు. ఇక్కడ 79.81 శాతం పోలింగ్ నమోదవడం విశేషం.
హుజూరాబాద్‌లో అత్యధికంగా 81.47 శాతం..
హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులకు జరిగిన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 29,531 మంది ఓటర్లు ఉండగా, 24,060 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోనే అత్యధికంగా 81.47 శాతం పోలింగ్ ఇక్కడ నమోదైంది.
చొప్పదండి మున్సిపాలిటీలో 78.76 శాతం..
చొప్పదండి మున్సిపల్ పరిధిలోని 14 వార్డులకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 13,916 మంది ఓటర్లు ఉండగా, 10,960 మంది ఓటు వేశారు. ఇక్కడ పోలింగ్ శాతం 78.76గా నమోదైంది.
హోరాహోరీగా ప్రధాన పార్టీల ప్రచారం..
మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. చివరి వరకు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలు, సంక్షేమ పథకాలు ప్రధాన అజెండాలుగా నిలిచాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
