అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం..

0

అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం..!
– ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
– 81.47 శాతం నమోదు
– ఓటు హక్కు వినియోగించుకున్న 24060 మంది
హుజురాబాద్:
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంది. ఈనెల 13న కౌంటింగ్ జరగనుంది. ఈలోగా పోటీ అభ్యర్థులు, వారిని బలపరిచిన పార్టీశ్రేణులు, అభిమానులు ఎవరికి వారే పోలింగ్‌ సరళిని సమీక్షిస్తూ గెలుపు అంచనాలపై లెక్కలు వేసుకుంటున్నారు. లోలోన గుబులు ఉన్నా, పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రశాంతంగా పోలింగ్…
హుజురాబాద్ మున్సిపల్ కేంద్రంలో 30 వార్డులు ఉండగా 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని 30 వార్డులకు ఎన్నికలు జరగగా 143 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో 81.47 గా శాతం పోలింగ్‌ నమోదైంది. మున్సిపాలిటీలో 29531 మంది ఓటర్లు ఉండగా 24060 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 60 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం అయిదు గంటలకు పోలింగ్‌ ముగియగానే బ్యాలెట్‌ పెట్టెలకు సీలు వేసి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించి భద్రపరిచారు. పోలింగ్‌ సరళిని బట్టి అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. పట్టణంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు తమకే మెజారిటీ స్థానాలు వస్తాయని ఆశిస్తుండగా తామే కీలకమవుతామని బిజెపి నేతలంటున్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని అధికార పార్టీ ధీమాగా ఉండగా బిఆర్ఎస్ సైతం భారీ ఆశలే పెట్టుకుంది.
హోరాహోరి…
ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం హోరాహోరిగా సాగింది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర మంత్రులు కార్నర్ మీటింగుల ప్రచారంలో పాల్గొన్నారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ అధికార పార్టీకే ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ఇన్చార్జిలు ప్రచారం నిర్వహించారు. పట్టణాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమంటూ ప్రచారం చేస్తూ కేంద్రం నిధులతో పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తామని బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ప్రచార సందర్భంగా ఓటర్లను కోరారు. బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుండి పోలింగ్ జరిగే వరకు అన్ని తానే నడిపించాడు పార్టీ అభ్యర్థులకు గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. కాగా పోలింగ్ ముగియడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎవరి అంచనాలు వేస్తూ గెలుస్తామని దీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 13న తేలనున్న భవితవ్యం..
ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొన్నది. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో అనే చర్చ పట్టణంలో మొదలైంది. ఈ నెల 13న కౌంటింగ్ చేయనుండగా అదే రోజు అభ్యర్థుల యొక్క భవితవ్యం తేలనుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *