జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం
కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం
– సజావుగా మున్సిపల్ ఎన్నికలు
– జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
– పోలింగ్ కేంద్రాల సందర్శన
– ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్
– వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ
– కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్ల పరిశీలన
కరీంనగర్:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు-2026 లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, మున్సిపాలిటీలకు బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల సరళని పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్ నుండి ఎన్నికల తీరును పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు. కరీంనగర్ లోని రోడ్లు భవనాల శాఖ ఎస్ ఈ కార్యాలయం, జ్యోతినగర్ లోని ఎస్సార్ ఉన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించారు. సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ ను పరిశీలించారు. ఈ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన వారికి మొక్కలు అందజేశారు.
ఏర్పాట్లు పరిశీలన..
పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య, అప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ, ఆన్లైన్లో నివేదికలు సమర్పించాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. సాయంత్రం 5 గంటల్లోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్…
రోడ్లు భవనాల శాఖ ఎస్ ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లొకేషన్ లో ఉన్న పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.
వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళి పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ స్క్రీన్ ల ద్వారా జిల్లా ఎన్నికల అధికారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. గుర్తించిన సమస్యత్మక పోలింగ్ కేంద్రాల ఆవరణలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు ద్వారా అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
కౌంటింగ్ కేంద్రం పరిశీలన…
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగియడంతో ఈనెల 13న జరిగే కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి పరిశీలించారు. ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపు వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో నమోదు చేయాలని అన్నారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
