రాజకీయ పబ్బం కోసమే నాటకాలు..

2

దళిత బంధు లబ్ధిదారులను తప్పుదోవ పట్టిస్తున్న ఎమ్మెల్యే…
. దరఖాస్తుల పేరుతో ధర్నా చేయడం దుర్మార్గం..
. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎందుకు ఇప్పించలేదు
. రాజకీయ పబ్బం కోసమే నాటకాలు..
. బ్యాలెన్స్ అమౌంటు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..
. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్
హుజురాబాద్:
మోసపూరిత మాటలతో రాజకీయ స్వలాభం కోసం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధు లబ్ధిదారులను తప్పుదోవ పట్టిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఆరోపించారు. శనివారం సింగపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దరఖాస్తు స్వీకరణతో పేరుతో పక్కా పథకం ప్రకారం డ్రామా ఆడాడని విమర్శించారు. ఎమ్మెల్యేగా అతను ప్రవర్తించిన తీరు రాజకీయాల్లో దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మోసపూరిత మాటలు విని దళిత బంధు లబ్ధిదారులు ఆగం కావద్దన్నారు. పెండింగ్లో ఉన్న దళిత బంధు డబ్బులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు. దళిత బంధు లబ్ధిదారులకు మిగిలిన డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. దళితుల మనోభావాలతో ఆడుకుంటే ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. ఎమ్మెల్యే మాటలు విని మోసపోతే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే అవుతుందన్నారు. శనివారం జరిగిన సంఘటనలో ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా నాటకాలు ఆడుతున్నాడని, బిఆర్ఎస్ డ్రామా స్కూల్లో కౌశిక్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చన్నారు. రెండేళ్ల పాటు ఎమ్మెల్సీ, విప్ గా అధికారంలో ఉండి దళిత బంధు ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి పోలీస్ అధికారుల పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమని ఇలాంటి చిల్లర వేషాలు వేసి హుజురాబాద్ ప్రజల గౌరవాన్ని తగ్గిస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి, టిపిసిసి ఎస్సీ సెల్ అట్రాసిటీ రాష్ట్ర ఇంఛార్జి తిప్పారపు సంపత్, నాయకులు కొలుగూరి కిరణ్, సందమల్ల బాబు, లావణ్య, పూదరి రేణుక, పర్లపల్లి నాగరాజు, సుంకరి రమేష్, ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, మిడిదొడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *