ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది
– రాష్ట్ర ఐ.టి, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు
. కరీంనగర్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కరీంనగర్:
కరీంనగర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి శ్రీధర్ బాబు గౌరవ వందనం స్వీకరించి జెండా ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడారు. సోదర, సోదరీమణులారా అంటూ మంత్రి శ్రీధర్ బాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచిన మనం.. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శతృవులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వాతంత్య్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం.
70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి ‘‘సన్న బియ్యం’’ పంపిణీని ప్రారంభించింది. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం.
రేషన్ కార్డు… ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా…భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది.
గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా… రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం.
‘‘ఇందిరమ్మ రైతు భరోసా’’ కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశాం. జూన్ 16న ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం.
7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం.
తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. గ్రీన్ ఛానెల్ లో నిధులు విడుదల చేస్తున్నాం. ఒక్క ఏడాదిలో నాలుగు లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయబోతున్నాం.
స్థానిక సంస్థలలో విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్- 1 లో 15, గ్రూప్-2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చాం.
ఆరోగ్య శ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీం. మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం.
27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం.
ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది.
యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండిరగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోం. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే… శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుంది.
2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు.. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం.
స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను.
మహాలక్ష్మి పథకం :-
జిల్లాలో 9 డిసెంబర్ 2023 న ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఇప్పటి వరకు 4 కోట్ల 97 లక్షల మంది మహిళలు వినియోగించుకున్నారు. తద్వారా 208 కోట్ల 57 లక్షల రూపాయల లబ్ధి పొందారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మన జిల్లాలో ఒక లక్షా 57 వేల 120 లబ్దిదారులకు ఇప్పటి వరకు 6 లక్షల 33 వేల 737 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగింది. ఇందుకు గాను 19 కోట్ల 59 లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించింది.
గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికి జీరో బిల్లులు జారీ చేస్తోంది. తద్వారా జిల్లాలో ఒక లక్షా 58 వేల 875 సర్వీసులకు గాను 6 కోట్ల 94 లక్షల 24 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.
వ్యవసాయ శాఖ:
జిల్లాలో 622.06 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి 79 వేల 541 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. ‘‘రైతుభరోసా’’ పథకం ద్వారా వానా కాలం సీజన్ ప్రారంభంలోనే ఒక లక్షా 90 వేల 186 మంది రైతులకు 206 కోట్ల 62 లక్షల 96 వేల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈ వానాకాలం 65 వేల 312 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. అవసరాన్ని బట్టి మరిన్ని ఎరువులు తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘‘రైతు బీమా’’ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు 23 కోట్ల 45 లక్షల రూపాయల బీమా సొమ్మును అందజేసి ఆర్థిక చేయూత కల్పించడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా జిల్లాలోని 12 వేల 483 వ్యవసాయ కూలీల కుటుంబాలకు 7 కోట్ల 48 లక్షల 98 వేల రూపాయలను జమ చేయడం జరిగింది.
ఇందిరమ్మ ఇండ్లు :
జిల్లాలో ఇంటి స్థలం ఉండి దరఖాస్తు చేసుకున్న 11 వేల 575 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే 5 వేల 672 ఇండ్ల నిర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరుగుతున్నాయి. గృహ నిర్మాణాన్ని బట్టి దశల వారీగా లబ్దిదారులకు 32 కోట్ల 30 లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగింది.
భూభారతి :
మన జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో, రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుండి భూ సమస్యల ధరఖాస్తులు స్వీకరించాం. ఇప్పటి వరకు 31 వేల 224 మంది రైతుల నుండి ధరఖాస్తులు తీసుకోని భూ భారతి పోర్టల్ ద్వారా శరవేగంగా అర్జీలను పరిష్కరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు మన జిల్లాలో 233 మంది లైసెన్స్ డ్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
వైద్య ఆరోగ్య శాఖ:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల ఉచిత వైద్య సేవలు వినియోగించుకొనేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో జనవరి, 2025 నుండి ఇప్పటి వరకు 3 వేల 278 కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగడం విశేషం. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో జనవరి 2025 నుండి ఇప్పటి వరకు 12 వేల 889 మందికి 36 కోట్ల 60 లక్షల విలువ చేసే శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించడం జరిగింది. ‘‘ఆరోగ్య మహిళా’’ కార్యక్రమం ద్వారా జిల్లాలోని మహిళలందరికి 6 నెలలకు ఒకసారి ఉచితంగా సుమారు 40 వేల రూపాయల విలువైన 54 రకాల వైద్య పరీక్షలు చేయించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు ఒక లక్షా 97 వేల మంది మహిళలు ఆరోగ్య మహిళా ఉచిత పరీక్షలు చేయించుకున్నారు. అందులో వ్యాధి తీవ్రత గుర్తించిన 4 వేల 534 మంది మహిళలను వివిధ ఆసుపత్రులకు రిఫర్ చేసి చికిత్స చేస్తున్నాం.
పౌరసరఫరాల శాఖ:
గత యాసంగి (రబీ) సీజన్ 2024-25లో 328 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 10 వేల 742 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇందులో దొడ్డు రకం ధాన్యం 2 లక్షల 77 వేల 400 మెట్రిక్ టన్నులు కాగా, సన్న రకం ధాన్యం 33 వేల 342 మెట్రిక్ టన్నులు. ధాన్యం విక్రయించిన 58 వేల 302 మంది రైతులకు 720.85 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది.
మన జిల్లాలో ఇప్పటి వరకు 37 వేల 28 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. 73 వేల 644 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేయడం జరిగింది. మొత్తంగా జిల్లాలో 2 లక్షల 90 వేల 402 కుటుంబాలకు గాను ప్రతి నెలా 5 వేల 583 టన్నుల సన్న బియ్యం పంపిణి చేస్తున్నాం.
జిల్లాలోని ఒక వేయి 519 సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కేజీవీబీలు, మోడల్ స్కూల్స్, అంగన్ వాడి కేంద్రాలకు 364 టన్నుల ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని ప్రతి నెలా సరఫరా చేస్తున్నాం.
విద్యాశాఖ :
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ముందు నిలిచేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బ్రిక్స్ టు బుక్స్, విద్యా వాహిని, వాయిస్ ఫర్ గర్ల్స్, కాన్షియెనసెస్ క్లబ్స్, టెడ్ ఎడ్ టాక్స్, బుధవారం బోధన, ఇంగ్లీష్ క్లబ్, విటమిన్ గార్డెన్స్ వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలుపుతున్నాం. గత విద్యా సంవత్సరం 12 వేల 508 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా, ఇందులో 12 వేల 245 మంది ఉత్తీర్ణత సాధించారు. 97.90 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో ఉంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 619 పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ:
ఈ సంస్థ ద్వారా గత యాసంగి సీజన్ లో 102 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 14 వేల 185 మంది రైతుల నుండి 165.81 కోట్ల విలువ గల 7 లక్షల 14 వేల 749 క్వింటాళ్ళ వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2 వేల 58 స్వయం సహాయక సంఘాలకు 208.77 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను ఇప్పించడం జరిగింది. 813 స్వయం సహాయక సంఘాల్లోని ఒక వేయి 946 మంది మహిళలకు 18.13 కోట్ల స్త్రీ నిధి రుణాలను మంజూరు చేశాం. సంఘాల సభ్యులను దూర విద్యలో చదువుకునేందుకు ప్రోత్సహించి 3 వేల 622 మందికి అడ్మిషన్ ఇప్పించాం.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఒక లక్షా 23 వేల 960 జాబ్ కార్డులు జారీ చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15.40 లక్షల పని దినాలను కల్పించి 11.36 లక్షల ఉపాధి కూలీలకు పనులను కల్పించడం జరిగింది. జిల్లాలో ‘‘చేయూత పించన్’’ పథకం ద్వారా ఒక లక్షా 36 వేల 237మంది లబ్ది పొందుతున్నారు. వీరికి ప్రతి నెలా క్రమం తప్పకుండా 32 కోట్ల రూపాయలను చెల్లించడం జరుగుతోంది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా):
‘‘ఇందిరా మహిళా శక్తి’’ ద్వారా 517 వ్యక్తి గత యూనిట్లకు 10 కోట్ల 16 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు 78 గ్రూపు యూనిట్లు ఏర్పాటు చేసి 7 కోట్ల 36 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. 217 స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 34 కోట్ల 65 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేయడం జరిగింది.
జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో 274 స్వయం సహాయక సంఘాలకు స్టీల్ బ్యాంక్ కిట్స్, 340 హోటళ్లకు స్టీల్ గ్లాస్ లు పంపిణీ చేయడం జరిగింది.
వన మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరంలో 17 లక్షల 32 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. ఇప్పటి వరకు 8 లక్షల 98 వేల 513 మొక్కలు నాటటంతో పాటు, 8 లక్షల 85 వేల 468 మొక్కలను పంపిణి చేయడం జరిగింది.
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ :
మహిళల ఆరోగ్యం, పోషకాహార స్థితిని మెరుగుపరిచేందుకు, సామాజిక సమస్యలు పరిష్కరించేందుకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్న శుక్రవారం సభ ఏడాది పూర్తి చేసుకుని ఉత్తమ ఫలితాలను ఇస్తోంది. స్నేహిత కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు గుడ్ టచ్- బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దివ్యాంగుల సమస్యలను, భావాలను అర్థం చేసుకునేందుకు తద్వారా వారి సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా అధికారులందరికి సైన్ లాంగ్వేజిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. జిల్లాలో 777 అంగన్ వాడీ కేంద్రాల్లో 8 వేల 225 మంది గర్భిణీలు, 9 వేల 698 మంది బాలింతలు, 22 వేల 522 మంది చిన్నారులకు అనుబంధ పోషకాహారం అందిస్తున్నాం.
ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ద్వారా 26 వేల 726 మంది విద్యార్థులకు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.
అగ్ని మాపక శాఖ ద్వారా విపత్తు సమయంలో ప్రజలను రక్షించేందుకు జిల్లాలో 300 మందికి ఆపద మిత్ర శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ఆపద మిత్ర వాలంటీర్లు విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని వేళలా ముందుంటారు.
సంక్షేమ వసతి గృహాలు :
షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి గృహాలు నిర్వహిస్తున్నాం. వీరికి ఉపకార వేతనాలు అందించడంతో పాటు, విదేశాల్లో ఉన్నత విద్యానభ్యసించాలనే పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. బీ.సి, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ సంక్షేమ, గురుకుల పాఠశాలలో అక్టోబర్ -2024 నుండి విద్యార్థులకు 200 శాతం డైట్ చార్జీలు, 40 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచాం. అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలలో కామన్ డైట్ మెనూ అమలు చేస్తున్నాం. అన్ని సంక్షేమ, గురుకుల హాస్టళ్లలో అల్యూమినియం పాత్రల స్థానంలో స్టీలు పాత్రలను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
పరిశ్రమల శాఖ :– మన జిల్లాలో 42 చిన్న తరహా పరిశ్రమలను 16 కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పడం జరిగింది. 68 పరిశ్రమలకు అనుమతులను జారీ చేయడం జరిగింది. ఈ పరిశ్రమల ద్వారా 755 మంది ఉపాధి కల్పించబడిరది.
మత్స్య శాఖ ద్వారా కోర్ర మీను చేపల ఉత్పత్తి పెంచేందుకు కరీంనగర్ జిల్లాలో 5 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో ‘‘సెంటర్ ఆఫ్ ముర్రెల్ ఎక్సలెన్స్’’ స్థాపించేందుకు తొలి విడతగా కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా సర్వతోముఖాభివృద్దికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా.. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

