పట్టణ రూపురేఖలు మారేలా అభివృద్ధి జరగాలి
హుజూరాబాద్ అభివృద్ధికి సహకారం అందిస్తా…
– పట్టణ రూపురేఖలు మారేలా అభివృద్ధి జరగాలి
– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
– మున్సిపల్ చైర్ పర్సన్ పదవి బాధ్యతల స్వీకరణ
– హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వొడితల ప్రణవ్
హుజరాబాద్:
హుజురాబాద్ అభివృద్ధికి నా వంతుగా బాధ్యతతో సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. మంగళవారం హుజరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, మాజీ రాజ్యసభ సభ్యులు రాజేశ్వర్ రావు, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి మున్సిపల్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ గా రొంటాల సువాసిని పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. హుజరాబాద్ అభివృద్ధి కోసం మున్సిపల్ పాలకవర్గం తీసుకునే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి తనను ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించినట్లు తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలని, గ్రామాలు పట్టణాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను రూపొందించిందన్నారు. హుజరాబాద్ పట్టణ అభివృద్ధి కోసం 300 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు అందించినట్లు తెలిపారు. పార్టీలకతీతంగా హుజురాబాద్ ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

హుజరాబాద్ ను హరితవనంగా మార్చాలి…
ఇప్పటి నుండే నర్సరీలను మరింత అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించి హుజురాబాద్ ను హరితవనంగా మార్చాలన్నారు. ఢిల్లీ లాంటి మహానగరంలో వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో రాకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. పట్టణంలో ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా తీర్చిదిద్దాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలన్నారు. ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తుందని, ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేయాలన్నారు.
యువత చదువుపై దృష్టి పెట్టాలి..
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలన్నారు. సెల్ఫోన్ కు సాధ్యమైనంత దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి అందరూ సహకరించాలన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కృషి..
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తున్నదన్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఎదిగే విధంగా ప్రత్యేక రుణాలను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. అనంతరం కౌన్సిలర్లను మంత్రి ఘనంగా సన్మానించారు.
పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలి..
– ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
హుజురాబాద్ లో గెలుపొందిన కౌన్సిలర్లు పార్టీల కతీతంగా పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. వ్యక్తిగత స్వార్ధ రాజకీయాల కోసం అభివృద్ధిని కుంటూ పడేసుకోవద్దని, ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్, ఆర్డీవో రమేష్ బాబు, ఏసీపీ మాధవి, మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సయ్యద్, వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి గౌతమ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
