ప్రధాని మోడీ హమారా బడే భాయ్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

0

హైదరాబాద్:

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమకు పెద్దన్న లాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొన్న మోదీకి రేవంత్ రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడాలన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరితో ఉంటే  రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. కేంద్రంతో తాము యుద్ధం చేయదలుచుకోలేదని చెప్పారు. ఒక పెద్దన్న మాదిరి ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరించాలని మోదీని కోరారు. ఈ క్రమంలోనే మోదీ నిర్ణయాలు, ఆయన వ్యవహారశైలిపై రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు.

కాగా ప్రధానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని జాతికి అంకితం చేశారు. పలు పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం సభలో పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు .

తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడిందని, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఇదే సంకల్పంతో ముందుకు సాగుతామని.. అన్ని వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందంటూ వివరించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని విన్నవించారు. మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులకు సహకరించాలని కోరారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందని అయితే గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1,600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందని అన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ లో 175 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. రేవంత్ వ్యాఖ్యలపై మోడీ స్పందిస్తూ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *