గ్రూప్ -1ప్రిలిమ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి
గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రశాంతంగా నిర్వహించాలి
. ఏలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
. సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి..
. మిషన్ భగీరథ పథకం అమలుపై ఇంటింటా సర్వే చేపట్టండి..
. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు
. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
. పలు అంశాలపై సమీక్ష..
. జిల్లా కలెక్టర్లు సీపీలు, ఎస్పీలకు కీలక ఆదేశాలు
కరీంనగర్:
ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేపట్టాలని సూచించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, డిజీపి రవి గుప్తా, అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లు, విత్తనాలు ఎరువుల సరఫరా, మిషన్ భగీరథ పథకం అమలు, స్కూల్ యూనిఫామ్స్ తయారీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారందరికీ కీలక ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేపట్టాలని పేర్కొన్నారు. ఓఎంఆర్ షీట్లు, ప్రశ్న పత్రాలు ఆయా జిల్లా కేంద్రాల్లో స్ట్రాంగ్ రూముల్లో తగిన భద్రత మధ్య భద్రపరచాలని ఆదేశించారు. ఈ నెల 9న ఉదయం ఐదు గంటలకల్లా ఆయా పరీక్ష కేంద్రాలకు ఓఎంఆర్ షీట్లు, ప్రశ్న పత్రాలు పోలీస్ ఎస్కార్ట్ మధ్య తరలించాలని పేర్కొన్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాస్తున్నారని, ఎలాంటి చిన్న మిస్టేక్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లో అనుమతించాలని చెప్పారు. సెల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి అనుమతించవద్దని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల రీజినల్ కోఆర్డినేటర్లు ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. చీఫ్ సూపరిండెంట్లు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్కాడ్స్, ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఒకరోజు ముందే పూర్తిస్థాయిలో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ అధికారులు పరీక్ష జరిగే రోజు అంతకు ముందు రోజు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రతి పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ నిఘా మధ్య ప్రశాంతంగా పరీక్ష నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విత్తనాలు ఎరువుల కొరత రావద్దు…
ఈ సీజన్లో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా టాస్క్ ఫోర్స్ బృందాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఒకే రకం పత్తి విత్తనం వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అనుమతి ఉన్న అన్ని కంపెనీల పత్తి విత్తనాలు వాడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు విత్తనాలు ఎరువులు నిల్వలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ముందు జాగ్రత్తగా ఇబ్బందులు రాకుండా రైతులకు అండగా ఉండాలని ఆదేశించారు. నెల రోజుల పాటు విత్తనాలు, ఎరువులు కొరత రాకుండా చూడాలని పేర్కొన్నారు. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. పంటల సాగులో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.
మిషన్ భగీరథ అమలుపై ఇంటింటా సర్వే…
గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం అమలు తీరు తెన్నులపై ఇంటింటా సర్వే చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్ల నీరు వస్తుందా లేదా అనే అంశంపై పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బంది, స్వశక్తి మహిళలతో కలిసి సర్వే చేయించాలని ఆదేశించారు. ఈ సర్వే పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ అంశంలో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు.
సత్వరమే స్కూల్ యూనిఫామ్స్ రెడీ చేయాలి..
నాలుగైదు రోజుల్లోగా స్కూల్ యూనిఫామ్స్ రెడీ చేసి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే స్కూల్ యూనిఫామ్స్ పూర్తిస్థాయిలో తయారు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫామ్స్ తో పాటు పాఠ్యపుస్తకాలు అందించే ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. యూనిఫామ్స్ పూర్తికానిచోట వేగవంతంగా తయారు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు. స్వశక్తి మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసమే స్కూల్ యూనిఫామ్స్ తయారీ బాధ్యతను వారికి ప్రభుత్వం అప్పగించిందని వివరించారు. అధికారులు ప్రథమ అంశంగా తీసుకొని స్కూల్ యూనిఫామ్స్ రెడీ చేసేలా పర్యవేక్షణ జరపాలని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినందున ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సాయంత్రమే ఎన్నికల కోడ్ ముగిసినందున సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులను శుక్రవారం నుంచి వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్ఓ పవన్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్, డీఈవో జనార్దన్ రావు, డీపీఓ రవీందర్, డీఆర్డీఓ శ్రీధర్ పలువురు పాల్గొన్నారు.
