ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా…

నా గెలుపు ప్రజలకే అంకితం…పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్:
తనను ఆదరించి ఆశీర్వదించిన ప్రజలకే తన గెలుపును అంకితమిస్తున్నానని బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఎన్నికల్లో 16873 ఓట్ల మెజార్టీతో కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల అధికారి రాజు చేతుల మీద గెలుపు పత్రాన్ని అందుకున్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు అవకాశం కల్పించిన కెసిఆర్, కేటీఆర్, కవిత లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హుజరాబాద్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. నా చివరి ఊపిరి వరకు ప్రజల కోసమే పని చేస్తానని నా జీవితాన్ని వారి సేవకే అంకితమిస్తున్నానన్నారు. ఇక జీవితంలో ఓటమి అనేది ఉండదని, హుజరాబాద్ గడ్డ కెసిఆర్ అడ్డాగా మిగిలిపోతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న తన తండ్రిని ఈటల రాజేందర్ రాజకీయంగా గొంతు కోశాడని ఆరోపించారు. తన గెలుపును తండ్రికి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తానన్నారు. హుజురాబాద్ ప్రజలు ఈటలకు బుద్ధి చెప్పారన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
హుజురాబాద్ లో కార్యకర్తల సంబరాలు…
కౌశిక్ రెడ్డి గెలుపు పట్ల హుజరాబాద్ లో కార్యకర్తలు నాయకులు సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది వచ్చిన కౌశిక్ రెడ్డికి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.