లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ఫిర్యాదులు, సూచనల కోసం గవర్నర్ కొత్త కార్యక్రమం
త్వరలో జరగనున్న లోక్ సభ (పార్లమెంట్) ఎన్నికల్లో ప్రజల ఫిర్యాదులు, సూచనలు తెలుసుకునేందుకు కొత్త కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీ.వీ.ఆనంద్ర బోస్ శ్రీకారం చుట్టారు. ‘లోగ్ సభ’ గా ఈ కార్యక్రమానికి నామకరణం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు నేరుగా గవర్నర్ అఫీషియల్ ఈమెయిల్ అడ్రెస్ కు ఏదైనా విషయంపై మెయిల్ చేయొచ్చు. [email protected] ఈ మెయిల్ అడ్రస్ కు జనం తమ సమస్యలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు పంపొచ్చు. గవర్నర్ తన కార్యాలయం నుంచి వెంటనే ప్రజలు పంపిన మెయిల్ ను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు.
రాష్ట్రప్రథమ పౌరుడిగా తాను పశ్చిమ బెంగాల ప్రజలకు ఎల్లప్పుడూ 24×7 టెలిఫోన్ తో పాటు ఈ మెయిల్ ద్వారా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటానని గవర్నర్ బోస్ వెల్లడించారు. ‘లోగ్ సభ’ కార్యక్రమానికి గవర్నర్ ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సందీప్ రాజ్ పుత్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని గవర్నర్ పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని గవర్నర్ ఆకాంక్షించారు.
