కౌశిక్ రెడ్డి ఘనవిజయం…

కౌశిక్ రెడ్డికే పట్టం…
. హుజురాబాద్ లో ఏడోసారి ఎగిరిన గులాబీ జెండా…
. 16,783 ఓట్లతో గెలుపు
. ఈటల కోటకు బీటలు..

హుజురాబాద్:
హుజరాబాద్ లో గులాబీ జెండా ఏడోసారి ఎగిరింది. బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈసారి పట్టం కట్టారు. ఆ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి 16,873 ఓట్లతో విజయం సాధించారు. ప్రజా సేవే ద్యేయంగా గెలుపే లక్ష్యంగా కౌశిక్ రెడ్డి ప్రణాళికతో ముందుకు సాగారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దిగమింగుకొని వ్యూహంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో తనకు తోడుగా తన భార్య శాలిని, కూతురు శ్రీనిక సైతం అండగా నిలిచారు. కౌశిక్ రెడ్డి గెలుపు కోసం వారు నిరంతరం శ్రమించారు. తన భర్తకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. తన కూతురు సైతం మా డాడీకి ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వాలని ప్రచారంలో ప్రజలను వేడుకున్నారు. కౌశిక్ రెడ్డి కుటుంబం ఓట్లు అభ్యర్థించిన తీరు ప్రజలలో ప్రభావాన్ని చూపింది.
హుజురాబాద్ గడ్డ బిఆర్ఎస్ అడ్డా….
హుజురాబాద్ గడ్డ బిఆర్ఎస్ అడ్డా అంటూ మరోసారి నిరూపించారు. 2004 నుంచి 2018 వరకు బిఆర్ఎస్ విజయం సాధిస్తూ వస్తున్నది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో కమలాపూర్ నియోజకవర్గ కేంద్రంతో పాటు జమ్మికుంట, వీణవంక హుజురాబాద్ నియోజకవర్గం లో విలీనం అయ్యాయి. కమలాపూర్ నియోజకవర్గం కనుమరుగయ్యింది. ఇక్కడి నుంచి 2009, 2010 ఉపఎన్నిక, 2014, 2018లో వరుసగా నాలుగు పర్యాయాలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి పై విజయం సాధించారు. సీఎం కేసీఆర్ తో విభేదించి ఈటల రాజేందర్ 2021 లో మంత్రి పదవికి, ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. బిజెపిలో చేరి ఉప ఎన్నికల బరిలో నిలిచారు. బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హుజరాబాద్ లో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై గెలుపొందారు.
ఈటల కోటకు బీటలు…
రెండు దశాబ్దాల పాటు ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నాడు. కాగా ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఈటల కోటను బద్దలు కొట్టి విజయం సాధించారు. ఈటల ఓటమే తన లక్ష్యంగా కౌశిక్ రెడ్డి ఒక పథకం ప్రకారం వ్యూహం పన్ని ఈటల ను ఓడించి ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన సత్తా చూపించాడు. కౌశిక్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా గ్రామాల్లో క్యాడర్ ను పెంచుకున్నాడు. గెలుపు లక్ష్యంగా ఎన్నికల వ్యూహంతో ముందుకు సాగి ఈటలపై ఘనవిజయం సాధించారు.
అభ్యర్థులు సాధించిన ఓట్లు ఇవే..
హుజురాబాద్ నియోజకవర్గలో 2,49,558 ఓట్లు ఉండగా 2,0,7,609 ఓట్లు పోలయ్యాయి. 1689 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. కాగా ఆదివారం కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. నియోజకవర్గంలో 305 పోలింగ్ బూతులు ఉండగా 22వ రౌండ్ లలో ఓట్లను లెక్కించారు. అందులో బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి 80,003 ఈవీఎం ఓట్లతోపాటు 330 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తో మొత్తం 80,333 ఓట్లను సాధించారు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ 62,845 ఈవీఎం ఓట్లతోపాటు 615 పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో మొత్తం 63,460 ఓట్లను సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ 52,461 ఈవీఎం ఓట్లతో పాటు 703 పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో మొత్తం 53,164 ఓట్లను సాధించారు. మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి 16,873 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.