కరీంనగర్ ను కబ్జాలకు, కరప్షన్ కు కేరాఫ్ గా మార్చారు

0

అవినీతి కి బ్రాండ్ అంబాసిడర్లుగా బిఆర్ఎస్ నేతలు..
. అధికారం ఊడగొట్టిన అవినీతి ఆగడం లేదు..?
. నగర పాలక సంస్థను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ లా మార్చిన సునీల్ రావు..
. కరీంనగర్ ను కబ్జాలకు, కరప్షన్ కు కేరాఫ్ గా మార్చారు
. నగర పాలక సంస్థలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి
. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.. మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్

కరీంనగర్:
బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి దాదాపు 14 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా అధికారంలో తామే ఉన్నామని విర్రవీగుతూ, నగర మేయర్ సునీల్ రావు అధికార దాహంతో ప్రతిచోట అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నగరపాలక సంస్థతో అన్ని అనుమతులతో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, తాను ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సైన్యాన్ని, నూతనంగా నిర్మిస్తున్న ఇండ్ల వద్దకు పంపుతూ, అధికారులతో ఒత్తిడి పెంచి లేనిపోని కారణాలు చూపుతూ విచ్చలవిడిగా ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. తమ దగ్గర సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, మాజీ డిప్యూటీ మేయర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ళపు రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం నగరంలోని ఓ ప్రైవేటు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుగ్గిళ్ళపు రమేష్ మాట్లాడారు. నగరపాలక సంస్థను మేయర్ సునీల్ రావు ప్రైవేటు సైన్యం తో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్ పేరు చెప్పి నయా రకం మోసాలకు తెరదించుతూ అపార్ట్మెంట్ల నిర్మాణం నుంచి స్మశాన వాటికల వరకు.. బడా కంపెనీల నుంచి చిరు వ్యాపారుల వరకు ఇలా ఎవరిని వదలకుండా డబ్బులు వసూలు చేశారని విమర్శించారు. గంగుల కరీంనగర్ నగరాన్ని కమిషన్లకు, భూ కబ్జాలకు కేరాఫ్ గా మార్చారని, తెలంగాణలో కెసిఆర్ కుటుంబం కరీంనగర్ లో గంగుల కుటుంబంతో పాటు అతడి అనుచరులు రాత్రింబవళ్లు దోచుకుంటూ దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అందుకే దాదాపు 89 వేల పైచిలుకు ప్రజలు బండి సంజయ్ కుమార్ ను తమ ప్రతినిధిగా ఎన్నుకోవడానికి సాహసోపేతంగా ఓటేశారన్నారు. ఎన్నికల ముందు సవాల్ చేసి మొహం చాటేసిన నీచ చరిత్ర మేయర్ సునీల్ రావు చల్లా హరిశంకర్ దని అన్నారు. కరీంనగర్ లో సామాన్యుడు ఇల్లు కట్టాలంటే గజగజలాడే పరిస్థితి నెలకొందన్నారు. నగరంలో బిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి డొల్లాగా అవినీతికి పరాకాష్టకు చేరుకుందని మండిపడ్డారు.

కోట్లాది రూపాయల నిధులు ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 రోజులకే చేయి చాపుతున్న మేయర్ సునీల్ రావు పరిస్థితి చూస్తుంటే దేహి అని బిక్షం అడుక్కుంటున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నగరపాలక సంస్థలో గత కొద్ది సంవత్సరాలుగా లాంగ్ స్టాండింగ్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బల్దియాలో మేయర్ తో పాటు మాజీ మంత్రికి వంత పాడిన అధికారులపై ఏసీబీతో విజిలెన్స్ తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో మేయర్ తో పాటు అధికారులందరిపై ఏసీబీకి విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బల్దియాలో ఒంటెద్దు పోకడలకు పోయి అనవసరంగా ప్రజలను వేధిస్తే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించడంతోపాటు దశలవారీగా బీజేపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోందని హెచ్చరించారు. రాబోయే పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ,, బల్దియా పై కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, దురిశెట్టి అనుప్ కుమార్, నాయకులు బండ రమణారెడ్డి, బంగారు రాజేంద్రప్రసాద్, శివరామకృష్ణయ్య,రాపర్తి ప్రసాద్,కటకం లోకేష్, ఎన్నం ప్రకాష్, గాజే రమేష్, నాగసముద్రం ప్రవీణ్, సుధాకర్ పటేల్, అవదుర్తి శ్రీనివాస్, పురం హరి, వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *