బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మోసపోతే గోసపడతరు..
– బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి
– పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా…
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్:
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు వేసి మోసపోతే గోసపడుతరని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజరాబాద్ పట్టణంలోని బీసీ ఎంఎస్ సూపర్ బజార్ రోడ్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. రైతుబంధు, వృద్ధులకు రూ.4000 పెన్షన్, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, తులం బంగారం వంటి హామీలలో ఒక్కటీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. రైతులకు అవసరమైన యూరియా బస్తాల సరఫరాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఎన్నికల సమయం దగ్గరపడగానే ప్రజల ముందుకు వచ్చి మాయమాటలతో ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, హామీల అమలుపై గట్టిగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుబంధు బకాయిలు, సన్నబియ్యానికి బోనస్ బకాయిలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం, నిరుద్యోగ భృతి గల్లంతు, విద్యా భరోసా కార్డ్ అమలు కాకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ రెండేళ్లుగా చెల్లించకపోవడం వంటి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ, ఆటో కార్మికులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయలేదన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే, హుజురాబాద్ నియోజకవర్గ గౌరవం నిలబెట్టాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

