హుజురాబాద్‌లో విజ్మనీ నూతన శాఖ

0

అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలందించడమే లక్ష్యం
– ఆర్థిక సేవలతో పాటు సామాజిక బాధ్యతకూ ప్రాధాన్యం
– విజ్మోని జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి
– హుజురాబాద్‌లో విజ్మోని నూతన శాఖ ప్రారంభం..
హుజురాబాద్ : 
ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన ఆర్థిక, విదేశీ మారకద్రవ్య, ప్రయాణ సేవలను అందించడంతో పాటు సామాజిక బాధ్యత కు ప్రాధాన్యం ఇవ్వడమే తమ సంస్థ లక్ష్యమని విజ్మోని జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ పట్టణంలో సంస్థ నూతన శాఖను ఆయన ప్రారంభించారు. శాఖ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కాట్రపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు సంస్థ తరఫున వాటర్ ప్యూరిఫైయర్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన ఆర్థిక సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో హుజురాబాద్‌లో నూతన శాఖను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నూతన శాఖ తెలంగాణ రాష్ట్రంలో సంస్థకు 38వ శాఖ కాగా, దేశవ్యాప్తంగా 371వ శాఖగా నిలిచిందని తెలిపారు. హుజురాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలు, ప్రాంతాల ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలను సులభతరంగా, పారదర్శకంగా, వేగంగా అందించేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులు, విదేశాల్లో నివసించే తమ కుటుంబ సభ్యులకు నగదు పంపించే వారు తదితరులకు అవసరమైన సేవలను ఒకే చోట అందించేందుకు నూతన శాఖను ఏర్పాటు చేసినట్లు వివరించారు. విదేశీ కరెన్సీ మార్పిడి, విదేశాలకు నగదు పంపించే సదుపాయం, విదేశీ ప్రయాణాల కోసం ప్రత్యేక నగదు కార్డులు, విమాన ప్రయాణ టికెట్ల బుకింగ్, విహారయాత్రల ప్రత్యేక ప్యాకేజీలు, తక్కువ వడ్డీ రేట్లతో బంగారు రుణాలు వంటి పలు సేవలను ఈ శాఖ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. హుజురాబాద్ ప్రాంత ప్రజలు సంస్థ అందించే ఆర్థిక, విదేశీ మారకద్రవ్య, ప్రయాణ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని అందించడం, వారి చదువుకు ప్రోత్సాహం కల్పించడం వంటి కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలతో పాటు ప్రజా సంక్షేమం, విద్యాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రీజనల్ అధికారి రాజేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ ఐఏటిఏ హెడ్ రవి, బ్రాంచ్ మేనేజర్ మూడంతం అనిల్, సంస్థ సిబ్బంది, పలువురు వినియోగదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!