ప్రకృతి పరిరక్షణను సామాజిక బాధ్యత గా స్వీకరించాలి
జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి
– ప్రకృతి పరిరక్షణను సామాజిక బాధ్యత గా స్వీకరించాలి
– జీవ శాస్త్రవేత్త షేక్ హుస్సేన్
– ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో పాఖాల లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
నర్సంపేట,పాఖాల:
వాతావరణంలో వస్తున్న మార్పులను అరికట్టడానికి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని జీవ శాస్త్రవేత్త, పర్యావరణ ప్రేమికుడు షేక్ హుస్సేన్ అన్నారు. అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా గురువారం పాఖలలోని జీవవైవిద్య పార్కులో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతితో సామరస్యం మరియు అభివృద్ధి అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు నర్సంపేట్ రేంజ్ అధికారి రవికిరణ్, నిర్మల్ రేంజ్ అధికారి వేణుగోపాల్, జన్నారం రేంజ్ అధికారిని సుష్మ, డిప్యూటీ రెంజ్ అధికారి రీనా, విధి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ధీరజ్, విజయ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇందారం నాగేశ్వర్ రావు, జాయింట్ సెక్రటరీ, ప్రముఖ పర్యావరణ వేత్త రవిబాబు పిట్టల, జర్నలిస్టులు కుడుతాడి బాపురావు, కొండల్ రెడ్డి, లింగబత్తిని కృష్ణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్జివో వరంగల్ స్వయంగా తీసిన అటవీ ఛాయా చిత్రాల ( వైల్డ్ లైఫ్ సొసైటీ ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్) ప్రదర్శనశాలను ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఔల్స్ స్వయంగా తీసి వివరణలతో కూడిన అటవీ ఛాయా చిత్రాలు, అందమైన జలపాతలు గ్యాలరీ ప్రదర్శన ప్రకృతి, పర్యావరణం, అడవి, అటవీ జంతువులు, సహజవనరులు వాటి ప్రాధాన్యత, వాటి పాత్ర, వాటి జీవన విధానం, సంరక్షణ, తరిగిపోతున్న వనాలు, వాటి విలువలు, అటవీ ఛాయచిత్రాలు ఆకర్షణగా నిలిచాయి. ముందుకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సు లో శాస్త్రవేత్త హుస్సేన్ మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని తెలిపారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పులపై ప్రజలంందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సహజ వనరులను కాపాడుకోవాలని, మొక్కలను విరివిగా నాటాలన్నారు.
జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపడతాం…
– నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికిరణ్
నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి కిరణ్ మాట్లాడుతూ… పాఖాలలో జీవ వైవిధ్యం కాపాడేందుకుఅన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ పక్షులు తక్కువగా ఉన్నాయని, వాటి సంఖ్య పెంచేందుకు కృషి చేస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామని పేర్కొన్నారు.
జీవ వైవిధ్యం యొక్క ప్రత్యేకత తెలుసుకోవాలి
– జన్నారం ఫారెస్ట్ రేంజ్ అధికారిని సుష్మ
జన్నారం ఫారెస్ట్ రేంజ్ అధికారిని సుష్మ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ జీవ వైవిధ్యం యొక్క ప్రత్యేకత తెలుసుకోవాలన్నారు. ప్రకృతిలో ప్రతి ఒక్కటీ మానవ జాతి మనుగడ కోసం ఉపయోగపడుతుందన్నారు. ప్రకృతిని పరిరక్షించుకోవాలని, విద్యార్థులను ప్రకృతికి దగ్గర చేయాలన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో మార్పు రావాలి
– నిర్మల్ అటవీశాఖ రేంజ్ అధికారి వేణుగోపాల్
నిర్మల్ అటవీ శాఖ రెంజ్ అధికారి వేణు గోపాల్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో మార్పు తీసుకురావాలన్నారు. సహజ వనరులను కాపాడుకోవాలన్నారు. ప్రకృతి విధ్వంసం వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయన్నారు. ఇలా జరగడం మానవ మనుగడకు ప్రమాదమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సహజ వనరులను కొల్లగొట్టడం దుర్మార్గం..
– ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ, ప్రముఖ పర్యావరణ వేత్త రవిబాబు పిట్టల..
ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ, ప్రముఖ పర్యావరణ వేత్త రవిబాబు పిట్టల మాట్లాడుతూ…ప్రపంచంలోని సౌందర్యమైన దేశాల్లో భారతదేశం ఒకటన్నారు. కానీ అందమైన దేశాన్ని స్వార్థం కోసం నాశనం చేస్తున్నామన్నారు. విలాసాలకు అలవాటు పడి దాన్ని డబ్బు రూపంలోకి మార్చుకుంటూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రకృతిలో సహజ వనరులను అవసరం మేరకే వాడాలన్నారు. కానీ ఇష్టానుసారంగా సహజ వనరులను కొల్లగొడుతూ జీవ వైవిధ్యం నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకృతి మనలను ఇప్పటికే హెచ్చరిస్తోందని, ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరు పాటుడాలన్నారు. సహజ వనరుల తరుగుదలకు ప్రధాన కారణాలు, పర్యావరణ, అటవీ, నీటి, వాయు చట్టాలను, జంతువుల, పక్షుల వేట, అక్రమ రవాణా (వైల్డ్ ట్రేడ్), దాని పర్యవసానాలు, భారత రాజ్యాంగం ఆర్టికల్ 51ఏ/(జి) ప్రకారంగా తమ చుట్టూ వున్నా పర్యావరణం, అడవులు, వన్యప్రాణుల పట్ల భూతదయ, సహజ వనరులను రక్షించి కాపాడుకోవడం ఈ దేశ ప్రతీ పౌరుని ప్రాథమిక విధి అని గుర్తు చేశారు. పూర్వికులు మనకిచ్చిన ఈ జాతీయ సంపదలను అవసరమున్నంతే వాడుకొని ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని ఒక ఆస్తిగా భావించి ఈ జాతీయ సంపదను ఇదేరూపంలో రాబోవు తరాలకు వారసత్వ ఆస్తిగా కాపాడి ఇవ్వాలని హితువు పలికారు. ఏమరపాటుగా బాధ్యత మరిచి మెదులుకుంటే మిగిలి ఉన్న వనరులు దుర్వినియోగం అవుతాయన్నారు. వాటిని అవసరమున్నంతే వాడుకుంటేనే మానవ, ఇతర జీవుల మనుగడ కొనసాగుతుందని భవిష్యత్ పరిణామాలను వివరించారు. పర్యావరణ వ్యవస్థల సమతుల్యతను కాపాడటానికి ప్రతి పౌరుడు ముందుకు వచ్చి జీవ వైవిధ్యం ను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం అటవీశాఖ అధికారులను, స్వచ్చంద సంస్థ ప్రతినిధులను, జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

