ఆదాయం కాదు వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యం..

4

ఆదాయం కాదు వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యం..
. నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించేది లేదు..
. నాగార్జున డెయిరీ ఏజిఏం సుధాకర్
హుజురాబాద్:
తమకు ఆదాయం కంటే వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యమని నాగార్జున డెయిరీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరు సుధాకర్ అన్నారు. బుధవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ లోని పరకాల క్రాస్ రోడ్ లో గల నాగార్జున డెయిరీ పై కొంతమంది కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిందలు వేస్తున్నారన్నారు. ఎవరైనా సరే డెయిరీకి వచ్చి పాల ఉత్పత్తులను పరీక్షించి తప్పులుంటే శిక్షించాలన్నారు. పుల్లూరు ప్రభాకర్ రావు నాగార్జున డెయిరీని ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులతో పాటు దళితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకున్నారన్నారు. తాము ప్రజలకు అందించే పాలను ప్రతినెల శాంపిల్స్ ల్యాబ్ కు పంపించి వారి ఆదేశాల ప్రకారమే స్వచ్ఛమైన పాలన అందిస్తున్నామన్నారు. ప్రజలకు అందించే పాల ఉత్పత్తుల్లో ఎక్కడ రాజీ పడలేదని అన్నారు. తమ డైరీలో పనిచేసే వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. తమ డెయిరీ కి పాలు పోసే రైతు కుటుంబంలో ఆడకూతురు వివాహం జరిగితే వారికి రూ.5వేలు ఆర్థిక సాయం, పాడి పశువు మరణిస్తే రూ.40 వేల, పాల అమ్మకపుదారులు మరణిస్తే లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు డైరీలో పనిచేసే ఉద్యోగులకు పిఎఫ్, ఈఎస్ఐ, ఎల్ఐసి లాంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు. గతంలో ఒక వ్యక్తి కొన్ని అంశాలతో కూడిన లెటర్ ప్యాడ్ ను అందించి 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో డైరీ మూసివేయాలని హెచ్చరించారన్నారు. అప్పుడు తాను స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నానని దాని ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. దానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అతని పై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగా తమ డైరీ పై ఇలాంటి తప్పుడు ప్రచారాలతో పాటు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాగార్జున డైరీతో సుమారు రెండు లక్షల మంది పాలను తాగుతున్నారని అలాంటి పాలపై తాము పూర్తి జాగ్రత్తతో పనిచేస్తామన్నారు. పాల నాణ్యతను తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త మిషన్లను ఏర్పాటు చేస్తూ ప్రజలకు స్వచ్ఛమైన పాలను అందిస్తున్నామని అన్నారు. నాగార్జున డైరీ పాలపై ఎవరికైనా అపోహలు ఉంటే తమను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని పూర్తి వివరాలు వారికి ఇస్తామని, అవసరమైతే ప్లాంట్ లో పాల తయారీని చూపిస్తామని అన్నారు. ఇప్పటికే డైరీపై ఆరోపణలు చేసిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశామని అన్నారు. నాగార్జున డైరీ ప్రజల ఆదరణతోటే ఇంత గొప్పగా ఎదిగిందని రాబోయే రోజుల్లో మరింత ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నాగార్జున డైరీ సిబ్బంది రజనీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, సంతోష్, శివకుమార్, బిక్షపతి, తిరుపతి, రాహుల్, రాజేశ్వరరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *