వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

0

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలి
. బ్రహ్మోత్సవాలు విజయవంతానికి సహకరించాలి
. ప్రతి ఇంటికి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందాలి
. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ఏర్పాట్లు జరగాలి
. భక్తులకు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి
. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
. ఫిబ్రవరి 14 నుండి 21 వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు
కరీంనగర్:
శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలను ఘనంగా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 14 నుండి 21 వరకు జరిగే శ్రీ లక్ష్మీ, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, నిర్వాహకులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ మార్కెట్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించనున్న స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా అత్యంత పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని ప్రతి ఇంటికి బ్రహ్మోత్సవాల వేడుకల ఆహ్వానం పత్రిక అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్యలకు తావు లేకుండా సజావుగా బ్రహ్మోత్సవాలు జరగాలన్నారు. జాతర కొరకు తాను 5 లక్షల విరాళం అందించానని, తనలాగే శ్రీవారి జాతర కొరకు భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలకు సంబంధించిన పూర్తి వివరాలను మరియు బ్రహ్మోత్సవాలకు జరిగే ఖర్చు వివరాలను కచ్చితంగా, పకడ్బందీగా రికార్డులలో నమోదు చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలలో ఆయా శాఖల అధికారులు వారి ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను ముందుగానే సమీక్షించుకోవాలని, స్వామి వారి సేవకు వచ్చే వారికి ఏకరూప దుస్తులు, ఐడి కార్డులను ఇవ్వడంతో పాటు, ఖచ్చితమైన టైం, స్థలం ప్రకారం వారికి విధులను కేటాయించాలని తెలిపారు. 14వ తేదీ నాటి అధ్యయనోత్సవం నుండి 21 నాటి శోభాయాత్ర వరకు ఎక్కడా ఎటువంటి అవాంతరాలు తలెత్తకూడదని, సానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ శాఖ ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి వన్ టౌన్, బస్ స్టాండ్ మీదుగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి తిరిగి దేవస్థానానికి వరకు దాదాపు కిలో మీటర్ దూరం వరకు నిర్వహించే శోభాయాత్రలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, సానిటేషన్, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, బ్రహ్మోత్సవాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, ఖచ్చితమైన ప్రోటోకాల్ ను పాటించాలని సూచించారు. ప్రతి రోజు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన మినిట్ టూ మినిట్ షెడ్యూల్ ను రూపొందించి అందించాలని తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల మరుసటి రోజు నుండి ప్రారంభం కానున్న సమ్మక్క-సారలమ్మ జాతర కొరకు తాత్కాలికమైన ఏర్పాట్లు కాకుండా శాశ్వత ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి అంతకుముందు మార్కెట్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ 5 లక్షల రూపాయలను విరాళంగా అందించారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ… గతంలో నిర్వహించిన కార్యక్రమాలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు నిర్వహించనున్న కార్యక్రమాలు ప్రణాళికను రూపొందించాలన్నారు. దేవాదాయ శాఖ ద్వారా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ప్రతి రికార్డులను నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదే విధంగా సంబంధిత శాఖలు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, డిఎఫ్ఓ బాలామణి, ఆర్డిఓ మహేశ్వర్, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టౌన్ ఎసిపి నరేందర్, జిల్లా పశు వైద్య మరియు పర్సనల్ వర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేందర్, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్ ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *